మిగిలింది మూడ్రోజులే!

May 8,2024 23:39

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. మరో మూడురోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, వీధుల్లో సభలు, సమావేశాలు,ఆత్మీయ భేటీలను వేగిరపర్చారు. ఎండ తీవ్రత వల్ల అభ్యర్థులు ఉదయం ఏడు గంటల కల్లా గ్రామాలు, వార్డుల్లోకి పరుగులుపెడుతున్నారు. ఎండ తీవ్రతవల్ల మధ్యాహ్నం 2 గంటల నుంచి నాలుగు గంటల మధ్య కొంత మంది విశ్రాంతి తీసుకుంటున్నారు. రాత్రి 10 గంటల తరువాత ప్రచారం ముగించుకుని ఆ తరువాత సామాజిక వర్గాలు, కుల సంఘం నాయకులతో మంతనాలు చేస్తున్నారు. ప్రత్యర్ధుల కదలికలను గమనిస్తూ పలు ఎత్తుగడలను రూపొందిస్తున్నారు. టిడిపి, వైసిపి విచ్చలవిడిగా డబ్బు పంపిణీ, మద్యం కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తుంది. గ్రామాల్లో ప్రభావితం చేసే నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు వారి వివిధ రూపాల్లో ఆశలు చూపిస్తున్నారు. డబ్బు,మద్యం పంపిణీ విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. కొంతమందికి గృహోపకరణాలకు సంబంధించిన కూపన్లు అందిస్తున్నారు. సర్వేల పేరుతో ఓటర్ల బ్యాంకు ఖాతాలను తీసుకుని నగదు బట్వాడా చేస్తామని నమ్మిస్తున్నారు. వైసిపి అభ్యర్థులయితే గత మార్చిలో వివిధ సంక్షేమ పథకాలకు సిఎం జగన్‌ విడుదల చేసిన నిధులు రాక అసంతృప్తిగా ఉన్న మహిళలను బుజ్జగించేందుకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చేనెల మొదటి వారంలోనే నిధులు మీ ఖాతాల్లో జమచేస్తామని నమ్మబలుకుతున్నారు. అలాగే ఓటర్లకు నగదు పంపిణీకి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ల పోలింగ్‌ సందర్భంగా ఆయా కేంద్రాల వల్ల టిడిపి,వైసిపి ఉద్యోగులకు నేరుగా సొమ్ముపంపిణీ చేస్తున్నా స్వాడ్‌ టీమ్‌లు ఏమాత్రంపట్టించుకోవడం లేదన్న విమర్శలు వచ్చాయి. జిల్లాలో మంగళగిరి, వినుకొండ, పెదకూరపాడు, తెనాలి, గుంటూరు పశ్చిమ, చిలకలూరిపేట, గురజాల, నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వం ఎక్కువగా ఉంది. ఈనియోజకవర్గాలపై ఎన్నికల సంఘం నిఘా కూడా అధికంగా దృష్టి పెట్టినా ఎవరికి వారు వారు రెండో కంటికి తెలియకుండా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అభ్యర్థులు తమ అనుచరుల ద్వారా 100 మంది ఓటర్లను మ్యానేజ్‌చేయగలిన వారిని ఇట్టే ఆకర్షిస్తున్నారు. గంపగుత్తగా తమకే ఓట్లు వేయాలని మీకేం కావాలో చెప్పండని బేరసారాలు చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరుతో కులాల వారీగా ఓటర్లను ఆకర్షిస్తున్నారు. గత 20 రోజులుగా ప్రచారంలో పాల్గొనేందుకు రాజకీయ కూలీలను ఎంపిక చేసుకుని ఏరోజు కూలి ఆ రోజు రాజకీయ ముఠా మేస్త్రీలకు అప్పగిస్తున్నారు.సంబంధిత మేస్రీ తన కమిషన్‌ తీసుకుని మిగతాసొమ్ము కూలీలకు పంచుతున్నారు.మద్యం పంపిణీకి గత నెలల్లోనే అభ్యర్థులు సంబంధిత దుకాణాలనుంచిభారీగా నిల్వలు కొనుగోలు రహస్యస్థావరాలకు తరలించారు. ఎక్సైజ్‌ అధికారులు అడపాదడపా దాడులు నిర్వహించారు.కొద్ది మంది అనుచరులు ,పార్టీ కార్యకర్తలు, రాజకీయ కూలీలతో కలిసి బృందాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో ఎంపి అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్‌, కిలారి రోశయ్య, జంగాల అజరుకుమార్‌ ప్రచారం ఉధృతం చేశారు. నర్సరావుపేట లోక్‌సభలో లావు శ్రీకృష్ణదేవరాయులు, పి.అనిల్‌కుమార్‌, అలెగ్జాండర్‌ సుధాకర్‌, ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులంతా తమ ప్రాంతాల్లో ప్రచారంలో నిమగం అయ్యారు. టిడిపి తరుఫున పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసిపి నుంచి సిఎం జగన్‌, వామపక్షాల నుంచి సీతారాం ఏచూరి, బి.వి.రాఘవులు, వి.శ్రీనివాసరావు, కె.నారాయణ, కె.రామకృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు. .జనసేన తరుఫున పవన్‌ కల్యాణ్‌, బిజెపినుంచి ప్రధాని మోడీ, ఇతర నాయకులు ప్రచారానికి హాజరు అయ్యారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనుండటంతో అసెంబ్లీ అభ్యర్థులు ఇప్పటి వరకూ అసలు సందర్శించని గ్రామాలను సందర్శిస్తున్నారు.

➡️