నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన ‘పీలా’

పీలా వెంకట జగ్గారావు (పివిజెఆర్‌)

వెంకటజగ్గారావుకు ఘననివాళి

ప్రజాశక్తి-అనకాపల్లి : ఎటువంటి అధికార పదవులు లేకపోయినా ఎంతో మందికి ఉపాధి కల్పించి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు పీలా వెంకట జగ్గారావు (పివిజెఆర్‌) అని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం స్థానిక గౌరీ గ్రంథాలయంలో నూకాంబికా దేవస్ధానం మాజీ చైర్మన్‌, వ్యాపారవేత్త, స్వచ్ఛంద సేవకులు పీలా వెంకట జగ్గారావు (పీవీజెఆర్‌) సంతాప సభ నిర్వహించారు. పీలా వెంకటజగ్గారావు చిత్రపటానికి మాజీమంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, పలువురు నేతలు పట్టణ ప్రముఖులు, ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. జగ్గారావుతో ఉన్న అనుబంధాన్ని అందరూ నెమరువేసుకున్నారు.ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులు పీవీజెఆర్‌ అని కొనియాడారు. క్రీడలపట్ల ఎంతో ఆసక్తి గల ఆయన చిన్నతనంలో తనకు లభించని ఆటలాడే అదృష్టాన్ని నేటి యువతకు, బాలలకూ అందుబాటులోనికి తేవటానికి తన వంతు సాయం అందించేవారన్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ చిన్నతనం నుంచీ ఆర్ధిక సమస్యలు, కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆపద్సమయాలలో పిలవకనే పలికే పేదల పెన్నిది పీలా వెంకట జగ్గారావు కీర్తి సాధించారని అన్నారు. జగన్నాధస్వామి దేవస్ధానం మాజీ చైర్మన్‌ దాడి ఈశ్వరరావు మాట్లాడుతూ వాణిజ్య ప్రముఖునిగా, స్వచ్ఛంద సేవకునిగా, పేద ప్రజలకు తోడునీడగా ఉన్న జగ్గారావు ఉన్నతస్ధాయికి చేరుకోవడానికి చేసిన కృషి, దీక్ష, పట్టుదల నేటి యువతకు ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో గౌరీ గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ, అధ్యక్షుడు దొడ్డి నూకఅప్పారావు, మాజీ కార్యదర్శి మళ్ల బాపునాయుడు, సినీ నిర్మాత పీలా తిలక్‌ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మాజీ మంత్రి వీరభద్రరావు.

➡️