బాధితుల పక్షాన పోరాడేవాడే కవి మహేశ్వరయ్య

Apr 27,2024 15:21 #Kurnool, #sabha, #vardanti
  •  3వ వర్దంతి సభలో వక్తలు

ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ : సమాజాన్ని మార్చగలిగే ఆయుధమే కవిత్వమని..బాధితుల పక్షాన కవి కలంపోరు చేయాలని వక్తలు అన్నారు. నగరంలోని లలితకళా సమితిలో శనివారం ఉదయం సాహితీ స్రవంతి నాయకులు యస్‌ మహేశ్వరయ్య మూడవ వర్దంతి సభ జరిగింది. జిల్లా ప్రధానకార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్‌ సభాధ్యక్షతన సభ జరిగింది. రాష్ట్రకార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ కవిగా,రచయితగా వ్యాసకర్తగా మహేశ్వరయ్య ఎనలేని సాహిత్యసేవ చేశాడన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చెందుకు సంఘం సిద్దంగా వుందన్నారు. ప్రస్థానం జిల్లా కన్వీనర్‌ డి.అయ్యన్న మాట్లాడుతూ బాధితుల పక్షాన పీడితుల పక్షాన నిలబడి మహేశ్వరయ్య రచనలు చేశాడన్నారు. జిల్లా గౌరవాధ్యక్షులు యంపి బసవరాజు మాట్లాడుతూ అంకితభావం గల ఉపాధ్యాయుడుగా కవిగా మహేశ్వరయ్య సేవలు అనిర్వచనీయమన్నారు. పదికాలాలు రచనలతో అలరించాల్సిన అక్షర సూరీడు మహేశ్వరుడని సభాధ్యక్షులు కొనియాడారు. సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ మాట్లాడుతూ ప్రతి ఏడాది మహేశ్వరయ్య పేరుతో పురస్కారమివ్వడం గొప్ప విషయమని నిఖార్సైన కవిత్వాన్ని కథలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సభను సాహితీస్రవంతి నాయకులు డి.పార్వతయ్య ప్రారంభించారు. సభ ప్రారంభానికి ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

➡️