ఓటరు తీర్పు ఎవరికో?

May 12,2024 21:55

ఉమ్మడి జిల్లాలో 134 మంది పోటీ

దారులన్నీ పోలింగ్‌ కేంద్రాలవైపే బస్సులు, రైళ్లు కిటకిట

మద్యం, డబ్బు ఎన్నికల్లో ప్రభావం చూపేనా?

టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌, సిపిఎం

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  ఐదేళ్లకోసారి పాలకులను నిర్ణయించుకునే సందర్భం మరోసారి వచ్చింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ రోజు వేసిన ఓట్లు, మెజార్టీ ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి. ఇలా ఏర్పడిన ప్రభుత్వాలు రానున్న ఐదేళ్లపాటు ప్రజల్ని పాలించనున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వలస ఓటర్లు తమ స్వగ్రామాలకు భారీగా తరలి వస్తున్నారు. శెలవుదినం కావడంతో ఆదివారం ఉదయం నుంచే బస్సులు, రైళ్లు, ఇతర ప్రైవేటు వాహనాలు కిటకిటలాడాయి. దారులన్నీ పోలింగ్‌ కేంద్రాలవైపే పరుగులు తీస్తున్నాయి. దీంతో, రహదారులు రద్దీగా మారాయి. తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు ఎంతో ఉత్సాహంతో చేరుకుంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో 80శాతం ఓటింగ్‌ నమోదైంది. రాష్ట్ర సరాసరి ఓటింగ్‌తో పోలిస్తే రెండు శాతం తక్కువ అయినప్పటికీ మిగిలిన అన్ని జిల్లాలతో పోలిస్తే ఎక్కువే. ప్రస్తుత ఎన్నికల్లోనూ అంతకు మించిన ఉత్సాహం కనిపిస్తుండడంతో ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గుచూపుతారో? అన్న అసక్తికరమైన చర్చనడుస్తోంది. ఉమ్మడి జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ భారీగా పోలవ్వడంతో వైసిపి, టిడిపి అభ్యర్థుల్లో ఎవరికి టనష్టం కలుగు తుందోనన్న గుబులు నెలకొంది. రెండు జిల్లాల్లోనూ టిడిపి కూటమి, వైసిపి ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు 134 మంది పోటీలో ఉన్నారు. మన్యం జిల్లాలో సిపిఎం పోటీచేస్తుండడంతో అక్కడ ముక్కోణపు పోటీ నెలకుంది. విజయ నగరంలో మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండడం వల్ల ఆమెకు వచ్చే ఓట్లు టిడిపి, వైసిపి అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేసే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 77 మంది పోటీ పడుతున్నారు. విజయనగరం అసెంబ్లీ స్థానంలో 15 మంది అభ్యర్థులు, శంగవరపుకోట లో 12, నెల్లిమర్ల లో 12, గజపతినగరం లో 13, చీపురుపల్లి లో 7, రాజాం లో 10, బొబ్బిలిలో 8 మంది, పార్వతీపురంలో 8 మంది, కురుపాంలో ఏడుగురు, సాలూరులో ఏడుగురు, పాలకొడలో ఏడుగురు పోటీ చేస్తున్నారు. విజయనగరం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని అరకు పార్లమెంట్‌ స్థానంలో 13మంది పోటీలో నిలిచారు. వీరిలో కురుపాంలో సిపిఎం మిగిలిన అన్ని పార్టీలూ ఓటర్లకు డబ్బు, మద్యం ఎరజూపాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలు రెండూ ఇందులో పోటాపోటీగా పంపిణీ చేశాయి. కానీ, వీటి ప్రభావం ఏమేరకు ఉంటుందో వేచిచూడాల్సిందే. దూర ప్రాంతాలనుంచి వ్యయ, ప్రాయసతో పనులు మానుకుని, సెలవులు పెట్టికుని మరీ వచ్చిన ఓటర్లు అంత తేలిగ్గా ఓట్లేసే పరిస్థితి లేదు. బిజెపితో టిడిపి నేరుగా పొత్తుపెట్టుకుంది. వైసిపి పరోక్షంగా గడిచిన ఐదేళ్లపాటు సహకరిస్తూ వచ్చింది. గడివచిన పదేళ్లలో ఈ రెండు పార్టీలూ బిజెపి విధానాలు నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా అమలు చేశాయి. ఈ నేపథ్యంలో బిజెపి ప్రత్నామ్నాయంగా దాదాపు అన్నిచోట్లా ‘ఇండియా’ వేదిక తరపున కాంగ్రెస్‌, సిపిఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆయా పార్టీలు, అభ్యర్థులు రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటున్న ఎపికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ సహా అనేక హామీల అమలుకు కృషి చేస్తామని చెప్తున్నారు. ఈనేపథ్యంలో బలమైన పార్టీలుగావున్న టిడిపి, వైసిపిలకే మళ్లీ పట్టం కడతారా? పదేళ్లపాటు రాష్ట్రానికి మోసం చేయడంతోపాటు అనేక రాష్ట్రాల్లో మత కల్లోలాలు సృష్టించిన రాజ్యాంగాన్ని ఉల్లఘంచిన బిజెపికి గుణపాఠం చెబుతారా? కాంగ్రెస్‌, సిపిఎం అభ్యర్థులకు ఓట్లేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతారా? వేచిచూడాల్సిందే.

➡️