వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

Jun 26,2024 21:13

 సమిష్టిగా కార్యాచరణ రూపొందించాలి : మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

డివిజన్‌ స్థాయిలో వ్యాధుల నియంత్రణపై ఆర్‌డిఒల పర్యవేక్షణ : కలెక్టర్‌

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి  :  ప్రస్తుత వర్షాకాలంలో మలేరియా, అతిసార, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం వున్నందున సంబంధిత ప్రభుత్వ శాఖలు నిరంతరం అప్రమత్తంగా వుంటూ తగిన కార్యాచరణ ప్రణాళిక రుపొందించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర చిన్న పరిశ్రమలు, సెర్ప్‌, ఎన్‌.ఆర్‌.ఐ.వ్యవహారాల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. కాలానుగుణ వ్యాధుల నియంత్రణపై బుధవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో జనావాసాల మధ్య నీటి నిల్వలు లేకుండా చూడటం, తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు చేపట్టడం, నీటి వనరులు క్రమం తప్పకుండా క్లోరినేషన్‌ చేయడం, పారిశుధ్య నిర్వహణ వంటి చర్యలపై దృష్టి సారించి శాఖలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలన్నారు. మలేరియా, డెంగీ కేసులు పెరగకుండా దోమల నిర్మూలన చర్యలను పెద్ద ఎత్తున చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా ఈ వ్యాధుల నియంత్రణలో ప్రజలను చైతన్య పరచాలన్నారు. గత నాలుగైదు ఏళ్లలో ఈ వ్యాధులు అధికంగా ప్రబలిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి మళ్లీ అటువంటి పరిస్తితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవిన్యూ డివిజనల్‌ అధికారులు తమ పరిథిలోని మండలాల్లో విస్తతంగా పర్యటిస్తూ ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న వ్యాధుల నియంత్రణ చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. జూలై 1 నుంచి ఆగష్టు 31 వరకు జిల్లాలో డయేరియా నియంత్రణపై ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నందున ప్రజల భాగస్వామ్యంతో వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో దోమల నియంత్రణకు స్ప్రేయింగ్‌ చేయించాలని ఆదేశించారు. డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు జిల్లాలో చేపట్టిన వ్యాధుల నియంత్రణ చర్యలను వివరించారు. గత ఏడాది మొత్తంలో 444 డెంగీ కేసులు, 439 మలేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 69 డెంగీ కేసులు, 283 మలేరియా కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ ఉమాశంకర్‌, డిపిఒ శ్రీధర్‌రాజా ఆయా శాఖల ద్వారా చేపట్టిన చర్యలను తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ లు ఎంఎం నాయుడు, రామప్పల నాయుడు, బాలాజీ ప్రసాద్‌, రామలక్ష్మి, ఆర్‌డిఒలు బి.శాంతి, ఎంవి సూర్యకళ, ఇన్‌ఛార్జి ఆర్‌డిఒ మురళీకృష్ణ, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

➡️