విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేత

ప్రజాశక్తి-చీమకుర్తి: మండలంలోని పాటిమీదపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠ శాల విద్యార్థులకు టిడిపి సీనియర్‌ నాయకులు పూనాటి వెంకటరావు నోటు పుస్తకాలు, విద్యా సామగ్రి అందజేశారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు ఎస్‌కె శిలార్‌ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ-2 కొల్లా శివాజీ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాల కల్పనలో పూనాటి వెంకటరావు చేస్తున్న కృషిని అభినందించారు. నోటు పుస్తకాలు, పలకలు విద్యా సామగ్రి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దాత పూనాటి వెంకటరావు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. చదువే అన్నింటికీ మూలమనీ, చదువు ఎడల శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటుపుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు, బలపాలు, చాక్‌పీసులు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పూనాటి వెంకటరావును ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పి నాయుడుపాలెం మాజీ ఉప సర్పంచ్‌ ఇస్తర్ల ఏడుకొండలు, ఉపాధ్యాయులు ఎస్‌వి సంజీవి, వాకా కవిత, నాయకులు ధర్నాసి చందు, కూడల చినశ్రీనివాసరావు, వీరాంజనేయులు, వెంకటరావు, సొంగా యాదగిరి పాల్గొన్నారు.

➡️