పలువురి నామినేషన్ల తిరస్కరణ

Apr 27,2024 00:32

మంగళగిరిలో పరిశీలనపై వివరిస్తున్న ఆర్‌ఒ రాజకుమారి
ప్రజాశక్తి-తెనాలి :
సార్వత్రిక ఎన్నికల్లో దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన అనంతరం ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రఖర్‌జైన్‌ శుక్రవారం తెలిపారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేసిన షేక్‌ బషీర్‌, డాక్టర్‌ చందు సాంబశివుడు, నవరంగ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మధిర మనోహర్‌, ఇండిపెండెంట్లు మాధవరపు నాగలక్ష్మి, ఐతగోని శివకుమార్‌, షేక్‌ జానిబాషా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ప్రజాశక్తి – మంగళగిరి : మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి 77 సెట్ల నామినేషన్లు దాఖలవగా వాటిని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో శుక్రవారం పరిశీలించారు. వీటిల్లో ఐదు నామినేషన్‌లు తిరస్కరణకు గురైనట్లు ఆర్‌ఒ జి.రాజకుమారి తెలిపారు. ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ చేసిన మురుగుడు లావణ్య నామినేషన్‌ సక్రమంగా లేనందున తిరస్కరించినట్లు చెప్పారు. మొత్తంగా 44 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇద్దరు తిరస్కరణకు గురవగా 42 మంది పోటీలో నిలిచారు. పరిశీలనలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నీరజ్‌ కుమార్‌, ఎన్నికల వ్యయ పరిశీలకులు పి.రాధనాథ్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – పొన్నూరు : నియోజవర్గానికి దాఖలైన 27 నామినేషన్లను ఆర్‌ఒ శుక్రవారం పరిశీలించారు. నిబంధనల ప్రకారం లేవనే కారణంతో 5 నామినేషన్లు తిరస్కరించారు. అంబటి మురళీకృష్ణ తరపున సిద్దినేని శ్రీనివాసరావు నామినేషన్‌ వేశారు. అయితే మురళీకృష్ణ నామినేషన్‌ను ఆమోదించినందున దానిని తిరస్కరించారు. జక్కా రవీంద్రనాథ్‌ తరుపున అందే దిలీప్‌ కుమార్‌ నామినేషన్‌ వేశారు. జక్కా రవీంద్రనాథ్‌ నామినేషన్‌ ఆమోదించినందున ఆ నామినేషన్‌ తిరస్కరించారు. దూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ తరుపున ధూళిపాళ్ల జ్యోతిర్మయి నామినేషన్‌ వేశారు. నరేంద్ర కుమార్‌ నామినేషన్‌ ఆమోదించబడినందున పై నామినేషన్‌ తిరస్కరించినట్లు చెప్పారు. ఆదాల బ్రహ్మయ్య బ్యాంకు డీటెయిల్స్‌, ఓటర్ల జాబితాలోని వివరాలు తోపాటు ప్రతిపాదకుల వివరాలు, ఫామ్‌-26 అఫిడవిట్‌లను వారికి ఇచ్చిన సమయంలో జతపరిచనికారణంగా తిరస్కరించారు. పరిశీలనలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ సూర్యనారాయణ సింగ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నయీమ్‌ అహ్మద్‌, ఎలక్షన్‌ డిప్యూటీ తహశీల్దార్‌ ఫణి కుమార్‌, అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️