నామినేషన్ల పరిశీలన పూర్తి

Apr 27,2024 00:47

అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లను పరిశీలిస్తున్న గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాలరెడ్డి
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల పరిశీలన శుక్రవారం ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జరిగింది. సాయంత్రం కల్లా పరిశీలన పూర్తయింది. శనివారం నుంచి సోమవారం వరకు ఉపసంహరణకు సమయం ఇచ్చారు. ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ల ఉపంహరణకు తుది గడువుగా ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. పరిశీలనలో గుంటూరు జిల్లాలో 53 నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం 228 మంది అభ్యర్థుల నామినేషన్లు పరిశీలన చేయగా 175 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. పల్నాడు జిల్లాలో 206 మందినామినేషన్లు దాఖలు చేయగా 70 తిరస్కరించారు. 136 సక్రమంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. గుంటూరు కలెక్టరేట్‌ లోని కలెక్టర్‌ చాంబర్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి స్వీకరించిన నామినేషన్ల పరిశీలన అభ్యర్థుల సమక్షంలో నిర్వహించారు. లోక్‌సభకు 47 మంది అభ్యర్థులు 67 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా పరిశీలనలో సక్రమంగా ఉన్న జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ముగ్గురు అభ్యరులు, రిజిస్టర్‌ కాబడి గుర్తింపు లేని రాజకీయ పార్టీల 17 మంది అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు 14 మంది మొత్తం 34 మంది అభ్యర్ధుల నామినేషన్లు రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. సక్రమంగా లేని 13 మంది నామినేషన్లను తిరస్కరించారు. పరిశీలనలను తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు ఎస్‌పి కార్తీకా పర్యవేక్షించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి విడదల రజనీ నామినేషన్‌పై టిడిపి నాయకులు అభ్యంతరం తెలిపారు. రజని భర్త కుమారస్వామికి అమెరికాలో పౌరసత్వం ఉందని ఆయన ఇటీవల చిలకలూరిపేట ప్రాంతంలో భూమి కొనుగోలు చేశారని, అందువల్ల ఈ నామినేషన్‌ చెల్లదని టిడిపి తరుఫున న్యాయవాదులు అభ్యంతరం తెలుపుతూ పిటీషన్‌ వేయగా రిటర్నింగ్‌ అధికారి తోసిపుచ్చారు. నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నామినేషన్‌లను పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ పరిశీలించారు. మొత్తం 27 మంది నామినేషన్లు దాఖలు చేయగా 8 తిరస్కరించారు. 19 సక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. తెనాలిలో కాంగ్రెస్‌ తరుఫున నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఒకేపార్టీ నుంచి ఇద్దరికి బి.ఫారం దాఖలు చేయడంతో తిరస్కరించారు.

➡️