ఎన్నికల నిర్వహణ సన్నాహకాలు వేగవంతం

Feb 7,2024 21:48

ధర్మవరంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

                         ధర్మవరం టౌన్‌ : ఎన్నికల నిర్వహణ సన్నాహకాలను వేగవంతం చేయాలని, ఇంటిపట్టా లబ్దిదారులకు చేసే రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం అధికారులు సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం ధర్మవరంలో పర్యటించారు. ముందుగా గుట్టకిందపల్లిలో మోడల్‌ స్కూల్‌ ను సందర్శించారు. ఆ పాఠశాల గదులను, పరిస్థితులను పరిశీలించారు. ఈవీఎం, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంగా ఈ పాఠశాలను ఉపయోగించుకోవాలని ఆయన నిర్ణయించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్డీవో వెంకటశివారెడ్డి, తహశీల్దార్‌ రమేష్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ రాంకుమార్‌, డీఎస్పీ శ్రీనివాసులు, సర్వేయర్లతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో ఎన్నికలప్రక్రియ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం మారుతీనగర్‌, లక్ష్మీచెన్నకేశవపురం సచివాలయ కేంద్రాలకు వెళ్లి అక్కడ సచివాలయ వ్యవస్థకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు జరుగుతున్న తీరును అడిగితెలుసుకున్నారు. మడకశిర : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను భద్రపరిచేందుకు మడకశిర నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రభుత్వ కళాశాలలోని పలు భవనాలను కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. నియోజకవర్గానికి సంబంధించి రిసెప్షన్‌ సెంటర్‌, ఇవిఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూములను ఏర్పాటు చేసేందుకు అనువైన భవనాలను పరిశీలించారు. మౌలిక సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, నియోజకవర్గ ప్రత్యేక అధికారి గౌరిశంకర్‌రావు, బాల ఆంజనేయులు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హిందూపురం :రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను భద్రపరిచేందుకు, హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్‌ రూం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న ఎంజీఎం హైస్కూల్‌ భవనాలను జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు పరిశీలించారు. అదే విధంగా రిసెప్షన్‌ సెంటర్‌ ఏర్పాటు తగిన సౌకర్యాలపై పరిశీలన చేశారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి, హౌసింగ్‌ పీడీ వెంకటనారాయణ, తహశీల్దార్‌ శివ ప్రసాద్‌ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్‌ రెడ్డి, డిఎస్‌పి కంజాక్షన్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️