కటాలపల్లి టిడిపి నేత హత్యకేసు ఛేదింపు

Mar 27,2024 22:29

హత్యకేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ, తదితరులు      

                      పుట్టపర్తి రూరల్‌ : జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన నల్లమాడ మండలం కటాలపల్లి గ్రామంలో జరిగిన టిడిపి గ్రామ నాయకుని హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని, వివాహేతర సంబంధం నేపథ్యమే కారణమని తేల్చారు. హత్య చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి బుధవారం నాడు జిల్లా పోలీసు కాన్ఫిరెన్స్‌ హాల్లో విలేకరులకు వెల్లడించారు. కుటాలపల్లి గ్రామానికి చెందిన మృతుడు అమర్నాథ్‌ రెడ్డి(41)కి టిడిపి గ్రామ నాయకునిగా గుర్తింపు ఉంది. వ్యవసాయం చేసుకుంటూ ఈయన జీవనం సాగించేవాడు. ఈ నెల 24వ తేదీన పొలం వద్ద నిద్రించిన ఈయన్ను గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో నరికి హత్య చేశారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునే దిశగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా బుధవారం నాడు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని విచారించి హత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. వివాహేతర సంబంధ నేపథ్యమే హత్యకు కారణంకుటాలపల్లికి చెందిన దుద్దుకుంట శ్రీనివాస్‌ రెడ్డి గత 15 సంవత్సరాలుగా కుటాలపల్లి తండాకు చెందిన రామావత్‌ తిప్పేబాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె బాగోగులు అన్నీ అతనే చూసుకునేవాడు. గత మూడు నెలల నుంచి హత్యకు గురైన దుద్దుకుంట అమర్నాథ్‌ రెడ్డి తిప్పేబాయితో చనువుగా ఉండేవాడు. అప్పటి నుంచి తిప్పేబాయి శ్రీనివాసరెడ్డిని దూరం పెట్టింది. దీనిపై ఆగ్రహించిన శ్రీనివాసరెడ్డి తిప్పేబాయిని గట్టిగా ప్రశ్నించాడు. ఇందుకు ఆమె అమర్నాథ్‌రెడ్డి తన కుటుంబ అవసరాల నిమిత్తం లక్ష రూపాయలు సాయం చేశాడని, ప్రతినెలా తనకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నాడని తెలియజేసింది. ఇంతకాలం తానూ కూడా సాయం చేశాను కదా అంటూ శ్రీనివాసరెడ్ది ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో లక్ష రూపాయలు అమర్నాథ్‌రెడ్డికి వెనక్కు ఇవ్వలేనని, నీవు ఇచ్చేస్తే మనిద్దరం కలిసి ఉండోచ్చని తిప్పేబాయి శ్రీనివాసరెడ్డికి తెలియజేసింది. శ్రీనివాసరెడ్డి ఆర్థిక పరిస్థితి బాగాలేనందు వల్ల డబ్బులు ఇవ్వలేనని చెప్పాడు. అయితే అమర్నాథ్‌రెడ్డిని అడ్డు తొలగించుకుంటేనే మనిద్దరం కలిసి ఉండొచ్చని తిప్పేబాయి శ్రీనివాసరెడ్డికి తెలిపింది. దీంతో శ్రీనివాసరెడ్డి అమర్నాథ్‌రెడ్డిని చంపేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందులో భాగంగా తనకు సన్నిహితులైన కటాలపల్లి గ్రామానికి చెందిన గుండ్ర వీరారెడ్డి, చౌటకుంటపల్లి గ్రామానికి చెందిన వినోద్‌ కుమార్‌ అలియాస్‌ కర్ణా సహాయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో 24వ తేదీ రాత్రి ఒంటరిగా పొలం దగ్గర నిద్రిస్తున్న అమర్నాథ్‌ రెడ్డిని చంపాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. అదే రోజు సాయంత్రం ముగ్గురూ నల్లమాడలో మద్యం సేవించి శ్రీనివాసరెడ్డి ద్విచక్రవాహనంలో అమర్నాథ్‌ రెడ్డి పొలం వద్దకి వెళ్లి అతని కోసం కాపుకాచారు. అమర్నాథ్‌రెడ్డి రాత్రి తోటలోకి రాగానే అప్పటికే తెచ్చుకున్న వేటకొడవలితో అతనిపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం ద్విచక్రవాహనంలో ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ హత్యోదయం తీవ్ర సంచలనం రేపడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గ్రామస్తులు, అనుమానితులను విచారించగా పలు విషయాలు తెలిశాయి. ఈ నేపథ్యంలో నిందితులు కటాలపల్లికి చెందిన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి, గుండ్ర వీరారెడ్డి, చౌటుకుంటపల్లికి చెందిన మల్లెల వినోద్‌కుమార్‌, కటాలపల్లి తండాకు చెందిన రామావత్‌ తిప్పేబాయిలను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారని ఎస్పీ మాధవరెడ్డి తెలియజేశారు. సిబ్బందికి ఎస్పీ ప్రశంస హత్య కేసును మూడు రోజుల వ్యవధిలో ఛేదించిన పోలీసులను ఎస్పీ మాధవరెడ్డి ప్రశంసించారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పుట్టపర్తి డీఎస్పీ పి.వాసుదేవన్‌, సోషల్‌ మీడియా ఇన్స్‌పెక్టర్‌ హేమంత్‌ కుమార్‌, పుట్టపర్తి రూరల్‌ ఇన్స్‌పెక్టర్‌ రాగిరి రామయ్య, నల్లమాడ సిఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌, నల్లమాడ ఎస్‌ఐ జి.రమేష్‌ బాబు, ఎఎస్‌ఐ సూర్యనారాయణ, హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు, కానిస్టేబుళ్లు నరసింహా, అశోక్‌, మనోహర్‌లను అభినందించారు.

➡️