పోలింగ్‌కు సర్వం సిద్ధం

May 12,2024 21:36

పోలింగ్‌కేంద్రాలకు వెళుతున్న సిబ్బంది

              పుట్టపర్తి అర్బన్‌ : శ్రీ సత్యసాయి జిల్లా లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఒక పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన సామాగ్రిని ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. జిల్లాలో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, మడకశిర, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా హిందూపురం పార్లమెంటు స్థాన పరిధిలో ఉన్నాయి. ఇందులో రాప్తాడు నియోజకవర్గం సగం సత్యసాయి జిల్లాలో సగం అనంతపురం జిల్లాలో ఉంది. జిల్లాలో 16, 56, 775 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 8,32,651 పురుషులు 8,24,048 మంది ఉన్నారు. ఇందులో 100 ఏళ్ల పైబడినవారు 13 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 1571 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో సమస్యాత్మక కేంద్రాలు 299 ఉన్నాయి. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా నిఘా ఉంచిన పోలింగ్‌ కేంద్రాలు 923 ఉన్నాయి. 13వ తేదీన బ్యాలెట్‌ ఈవీఎంలను మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాలకు సంబంధించి హిందూపురం సమీపంలోని మలుగూరు గ్రామం వద్ద గల బిట్స్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూములలో పటిష్టమైన భద్రతతో భద్రపరుస్తారు. అలాగే పుట్టపర్తి, కదిరి, ధర్మవరం నియోజకవర్గలకు లేపాక్షి మండలంలోని చోళ సముద్రం వద్దగల డాక్టర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో ఈవీఎంలను భద్రపరుస్తారు. జూన్‌ 4న అక్కడే ఓట్లు లెక్కింపు చేపడతారు. 13న జరగబోయే ఎన్నికలకు ఆయా నియోజకవర్గ కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రిని తరలించారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.

కొత్తచెరువు రూరల్‌ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం నిర్వహించే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తహశీల్దార్‌ కళావతి తెలిపారు మండల వ్యాప్తంగా 38 పోలింగ్‌ కేంద్రాలలో 32,700 మంది ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వినియోగించు కోనున్నారన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు ఆయా కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ఎక్కడే కానీ గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.

కదిరి అర్బన్‌ : సోమవారం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన ఎన్నికల సామాగ్రి పంపిణీ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా మండలాల వెళ్లాల్సిన అధికారులు సామాగ్రి తో వెళ్లారన్నారు. ఆదివారం రాత్రి కి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటారన్నారు. ఎన్నికల పోలింగ్‌ కేంద్రానికి అవసరమైన మౌలిక సదుపాయాలని కల్పించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధులను అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ముదిగుబ్బ : మండలంలోని15 పోలింగ్‌ కేంద్రాలను తహశీల్దార్‌ సరస్వతి సోమవారం పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రంలో విద్యుత్‌ నీటి సౌకర్యం తదితర వాటిపై ఆరా తీశారు.

హిందూపురం : సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రిటర్నింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ ఆద్వర్యంలో పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం పట్టణంలోని ఎంజిఎం ఉన్నత పాఠశాలలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి, ఈవిఎం, వివి ప్యాట్‌ ల పంపిణీ చేశారు. డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌ వద్ద పెద్దపెద్ద టెంట్లు ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రతకు ఇబ్బంది లేకుండా కూలర్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించారు.. నియోజకవర్గంలో హిందూపురం పురపాలక సంఘం, రూరల్‌ మండలం, లేపాక్షి, చిలమత్తూరు మండలాలకు సంబందించి 253 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు అందుకు తగిన రీతిలో సిబ్బందిని కేటాయించి, వారిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు బస్సులతో పాటు, ప్రైవేటు వాహనాలను ఉపయోగించారు. ఇదే సందర్బంగా సిబ్బందికి ఈవిఎం, వివి ప్యాట్‌ లను ఎలా ఉపయోగించాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల తహశీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. పటిష్టమైన బందోబస్తు : ఎస్పీ సార్వత్రిక ఎన్నికల సందర్బంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన బందోబస్త్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్‌పి మాధవ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో ఎంజిఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌ను ఆయన పరిశీలన చేశారు. ఈ సందర్బంగా నియోజక వర్గ వ్యాప్తంగా చేపట్టిన బందోబస్త్‌ పై వివరాలను డిఎస్‌పి కంజాక్షన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు శ్రీనివాస్‌, ఈరన్న, శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️