కమలంలో కాక..!

           అనంతపురం ప్రతినిధి : టిడిపి, జనసేనతో కలసి సీట్లు సర్ధుబాటు చేసుకున్న బిజెపిలో టిక్కెట్ల కాక పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీచేసి ఒక్క శాతం ఓట్లు కూడా దక్కని ఆ పార్టీకి ఈసారి పొత్తులో నెగ్గుకురావాలని చూస్తోంది. అయితే సీట్ల సర్ధుబాట్లతోపాటు, టిక్కెట్ల కేటాయింపులు కాకపుట్టిస్తున్నాయి. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్టు పొత్తుల్లో భాగంగా బిజెపి తీసుకుంది. ఈ నియోజకవర్గంలో ముందు నుంచి సొంతగా పట్టు కలిగిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు ఇస్తారని భావించారు. చివరి వరకు అదే పేరు వినిపించింది. అంతేకాకుండా అధిష్టానం నుంచి సంకేతాలున్నాయంటూ ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న శ్రీరామ్‌ వర్గీయులు ఆయనకు ఇవ్వడానికి వీల్లేదని నిరసనలు చేపట్టారు. ఇతరులెవరికిచ్చినా సహకరిస్తామని ప్రకటించారు. అయినా స్వతహాగా ఈ నియోజకవర్గంలో బిజెపికి అంతటి బలం లేదు. ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేదన్నది పూర్వపు ఎన్నికల్లో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో జి.సూర్యనారాయణకే బిజెపి టిక్కెట్టు వస్తుందని భావించారు. చివరి నిమిషంలో బిజెపి అభ్యర్థుల్లో మార్పులు చేపట్టింది. హిందూపురం పార్లమెంట్‌కు పోటీ చేయాలనుకుంటున్న సత్యకుమార్‌ను తీసుకొచ్చి ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో సత్యకుమార్‌కు ఏ మాత్రం పట్టులేదు. కనీసం ఈ ప్రాంతంలో ఎటువంటి సంబంధాలూ లేవు. ఒకరకంగా చెప్పాలంటే ఈయనెవరో కూడా ఇక్కడి ప్రజలకు తెలియదు. అటువంటి వ్యక్తిని ఇక్కడ పోటీలో పెట్టడం అందరనీ విస్మయానికి గురిచేస్తోంది. ఇంకో వైపు సత్యకుమార్‌ కూడా అసెంబ్లీ కంటే పార్లమెంటు వైపే ఎక్కువ మొగ్గు చూపినప్పటికీ బిజెపి ఇక్కడి నుంచి బరిలో దింపాలని నిర్ణయించింది. కూటమిలో భాగంగా హిందూపురం పార్లమెంటు టిక్కెట్‌ను ఆశించిన వారిలో పరిపూర్ణానంద స్వామి ఉన్నారు. ఈ స్థానం బిజెపికి కేటాయిస్తున్నట్టు మందుగా ప్రకటనలూ వచ్చాయి. అయితే ఆఖరు నిమిషంలో ఈ నియోజకవర్గం పొత్తుల్లో టిడిపికే ఉండిపోయింది. దీనిపై పరిఫూర్ణానందస్వామి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బిజెపి టిక్కెట్టు ఇవ్వకున్నా స్వతంత్రంగా పోటీ చేస్తామనని ప్రకటించారు. ఇలా బిజెపిలో టిక్కెట్ల గోల నడుస్తోంది. సత్యకుమార్‌ ధర్మవరం నుంచి పోటీ చేస్తే మాజీ ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ ఏ మేరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఆయనకే టిక్కెట్టు ఉంటుందని భావించి ప్రచారం కూడా ప్రారంభించుకున్నాక మార్పు జరగడంతో ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్రగా పోటీ చేస్తే ఎలాగుంటుందన్న ఆలోచనలోనూ ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే బిజెపి పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశముంది.

➡️