టిడిపికి అత్తార్‌ రాం రాం

Mar 31,2024 22:56

రాజీనామా లేఖను చూపుతున్న ఆత్తార్‌చాంద్‌బాషా

                 కదిరి టౌన్‌ కదిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్‌ అత్తార్‌ చాంద్‌ భాషా తెలుగు దేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు చంద్రబాబుకు పంపారు. సోమవారం కదిరిలో సిఎం జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరనున్నారు. ఈ మేరకు అత్తార్‌ చాంద్‌బాషా ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వైసిపి నుండి టీడీపీలో చేరానని, పార్టీలో చేరిన తనకు అన్ని విధాలుగా అవమానాలే తప్ప తగిన గుర్తింపు లభించలేదని అన్నారు. మంత్రి పదవితో పాటు తగిన గుర్తింపును ఇస్తామని చంద్రబాబు అప్పట్లో చెప్పారని, ఆ తరువాత మాట తప్పారనివిమర్శించారు. ముస్లిం మైనార్టీల పట్ల చంద్రబాబుకు చిత్త శుద్ధి లేదని అందుకే టిడిపిలో కొనసాగలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. టిడిపిలో మైనార్టీలకు అవమానాలు తప్ప అధికారం లేదనిఆరోపించారు. కదిరి నియోజవర్గంలో ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నారని, తనకు టికెట్‌ ఇవ్వకుండా చంద్రబాబు అవమానపరిచారనిఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కదిరి పట్టణంలో చంద్రబాబు ప్రజాగళం పేరుతో పర్యటించారని కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదని, ఇఫ్తార్‌ విందు సమా చారం కూడా తెలియ పరచలేదని వాపోయారు. మైనార్టీలను మోసం చేస్తున్న టిడిపిలో కొనసాగలేకపోతున్నాని అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. నేడు సిఎం జగన్‌ సమక్షంలో వైసీపీలోకి అత్తార్‌.. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌భాషా ఆదివారం తెలుగుదే శం పార్టీకి రాజీనామా చేశారు. మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కదిరి పర్యటనకు వస్తుం డగా.. సీఎం సమక్షంలో అత్తార్‌చాంద్‌బాషాతో పాటు ఆయన అనుచరులు సైతం వైసీపీలో చేరనున్నారు.

➡️