డ్వాక్రా రుణాల చెల్లింపులో గోల్‌మాల్‌..

Feb 21,2024 21:37

తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్న మహిళాసంఘ సభ్యురాలు

                      సోమందేపల్లి : డ్వాక్రా రుణాలు తీసుకొని ప్రతినెలా సక్రమంగా కంతులకు సంబందించిన డబ్బును యానిమేటర్‌కు నమ్మి ఇస్తే చేతివాటం ప్రదర్శించి లక్షల రూపాయల కాజేసిందని మహిళా సంఘాల సభ్యులు వాపోతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈఘటనకు సంబందించి బాధితులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పత్తి కుంటపల్లిలో శ్రీ సత్యసాయి, నానావళి సంఘాల సభ్యులు బ్యాంకులో రుణం తీసుకున్నారు. ప్రతినెల కట్టే కంతులకు సంబందించిన డబ్బులను ఆసంఘాల సభ్యులు ఆనిమేటర్‌ పార్వతికి ఇచ్చేవారు. అయితే ఆమె బ్యాంకులో జమ చేయకుండా తన అవసరాలకు ఉపయోగించుకుంది. శ్రీ సత్యసాయి సంఘ సభ్యులు రెండు సంవత్సరాల క్రితం రెండు లక్షల రూపాయల రుణం తీసుకుని అన్ని కంతులు కట్టివేశారు. తర్వాత రుణం కావాలని పలుమార్లు యానిమేటరు అడిగారు. అయితే ఆమె ఈరోజు, రేపు అని చెప్పి ఆరు నెలలుగా కాలయాపన చేసింది. దీంతో ఆ సంఘ సభ్యులు స్థానిక పాలసముద్రంలోని కెనరా బ్యాంకు వారిని కలిసి తాము రుణం మొత్తం కట్టేశామని తమకు కొత్త రుణం మంజూరు చేయాలని కోరారు. దీంతో బ్యాంకు అధికారులు ఆసంఘం బ్యాంకు ఖాతాను పరిశీలించారు. ఇంకా 75 వేల రూపాయలు అప్పు మిగిలి ఉందని అది కట్టివేస్తే రుణం ఇస్తామని చెప్పారు. దీంతో సంఘం సభ్యులు అవాక్కయ్యారు. సభ్యులందరూ వెళ్లి ఆనిమేటర్‌ పార్వతిని నిలదీశారు. తమకు జరిగిన అన్యాయాన్ని సంబందిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా యానిమేటర్‌ కు సర్ది చెప్పి ఆమె వాడిన మొత్తం అమౌంట్‌ ను బుధవారం లోపు కట్టే విధంగా సెటిల్మెంట్‌ చేశారు. ఈ విషయం పలు సంఘాల సభ్యులకు తెలిసింది. తమకు ఇచ్చిన రుణం ఏమైందోనని నానావళి సంఘ సభ్యులు బుధవారం పాలసముద్రం కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ను కలిశారు. ఆసంఘం బ్యాంకు ఖాతాను చెక్‌ చేయించారు. నానావళి మహిళా సంఘ సభ్యులు 10 మంది ఉండగా వారు రూ. 6.60 లక్షలలు రుణం తీసుకున్నారు. ఒక్కొక్క సభ్యురాలు నెలకు మూడు వేల రూపాయలతో 30 వేల రూపాయలు వసూలు చేసి సభ్యులలో ఒకరిద్దరూ ఆనిమేటర్‌తో కలిసి బ్యాంకుకు వెళ్లి కంతు కట్టేవారు. అయితే సంఘ సభ్యులు నిరక్షరాస్యులు, అమాయకులు కావడంతో ఆనిమేటర్‌ వారితో డబ్బు తీసుకొని తానే బ్యాంకు స్లిప్‌ రాసి ఇచ్చిన అప్పులో కొంత మాత్రమే కట్టి మిగతా మొత్తాన్ని తన అవసరాలను వాడుకున్నట్లు బయట పడింది. ఫిబ్రవరి 12న సంఘ సభ్యులు అందరూ రూ.29,500 వసూలు చేసి బ్యాంకులో రుణం కంతుకట్టడానికి యానిమేటర్‌ తో వెళ్లగా ఆనిమేటర్‌ బ్యాంకులో కేవలం రూ. 2, 950లు మాత్రమే బ్యాంకులో కట్టి బ్యాంక్‌ వారిచ్చిన స్లిప్పులో మరో సున్నా చేర్చి ఆస్లిప్పును సంఘ సభ్యులకు ఇచ్చినట్లు గుర్తించారు. ఒక్కొక్క కంతుకు రూ. 30,000 వేల ప్రకారం మొత్తం 15 కంతులకు గాను కేవలం రూ. 1. 65 లక్షలు మాత్రమే బ్యాంకులో జమ చేయగా ఇంకా రూ. 5. 50 లక్షలు బాకీ ఉన్నట్లు బ్యాంకు అధికారులు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో నానావళి సంఘ మహిళా సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కూలీనాలి చేసి అప్పు కట్టామని ఆనిమేటర్‌ చేతివాటం ప్రదర్శించడంతో బ్యాంకులో అప్పు అట్లే ఉండిపోయిందని కన్నీరు పెట్టుకున్నారు. వెలుగు అధికారులు తమకు న్యాయం చేయకపోతే ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులకు విన్నవిస్తామని , పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎపిఎం రామాంజనేయులు వివరణ : పత్తికుంటపల్లి డ్వాక్రా సంఘాల లో జరిగిన అవకతవకలపై ఎపిఎం రామాంజనేయులును వివరణ శ్రీ సత్యసాయి సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసి ఆనిమేటర్‌ పార్వతి తోనే ఆమె వాడుకున్న డబ్బును కట్టించామన్నారు. ఆ సంఘానికి 10 లక్షల రూపాయల లోన్‌ కూడా మంజూరు చేయడానికి బ్యాంక్‌ వారికి విజ్ఞప్తి చేశామన్నారు. ఇక నానావతి సంఘంలో జరిగిన అవకతవకలపై ఆ సంఘ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ తీసుకున్నామని దీనిపైన తమ సీసీతో విచారణ చేయిస్తామని చెప్పారు. అవకతవకలు నిజమని తెలిస్తే సంఘ సభ్యులు నష్టపోయిన అమౌంటును ఆనిమేటర్‌ తోనే కట్టిస్తామని చెప్పారు. ఆనిమేటర్‌ చేసిన అవకతవకలను జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి వారి సూచన మేరకు ఆనిమేటర్‌ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

➡️