తాటాకు చప్పుళ్లకు భయపడం

Jan 8,2024 22:27

హిందూపురంలో జరిగిన నిరసనలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌

                            హిందూపురం : ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ హెచ్చరించారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 28వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా అంగన్వాడీలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్‌ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం సమ్మె శిబిరం వరకు ర్యాలీ చేపట్టి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ మాట్లాడుతు ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌-2ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అంగన్వాడీ కేంద్రాలు తెరిచేది లేదన్నారు. వేతనాలు పెంచుతున్నట్లు మరో జీవో వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గతంలో ఎస్మాను ప్రయోగించిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తు చేశారు. అంగన్‌వాడీలకు మద్దతుగా ఈ నెల 9న జైల్‌ భరో కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు తీర్మానించాయని చెప్పారు. పట్టుదలతో పోరాడుతున్న అంగన్‌వాడీలకు కేంద్ర కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అండగా నిలిచినందుకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి లావణ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శైలజ, శిరీషా, నాగమ్మ, రీహాన, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి రూరల్‌: పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ముందు అంగన్వాడి రిలే నిరాహార దీక్షలు సోమవారం కొనసాగాయి. ఈ దీక్షల్లో ధర్మవరం, బత్తలపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు వాసంతి, నూర్జహాన్‌, నాగలక్ష్మి, నాగసుధ, విజయలక్ష్మి, ఫాతిమా, జయలక్ష్మి సుగుణ, వెంకట్‌ లక్ష్మి, వన్నూరమ్మ 24 గంటలు నిరాహార దీక్షలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ అంగన్వాడీలపై ఉపయోగించి ఎస్మా చట్టం తక్షణం ఉపసహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 28వ రోజులుగా సమ్మె చేస్తున్న సమస్య పరిష్కారం చేయకుండా నిర్బంధం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, జయలలిత లక్ష 70 వేల మందిని, ఎస్మా ప్రకటించి తొలగిస్తే, వారు తిరిగి కోర్టు ద్వారా ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకఉద్యమాన్ని విచ్చిన్నం చేయడానికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి సాంబశివ, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు మాబున్నీ, ప్రధాన కార్యదర్శి కోశాధికారి సిఎస్‌ శ్రీదేవి, ధర్మవరం ప్రాజెక్ట్‌ లీడర్లు సరస్వతి, చంద్రకళ, బత్తలపల్లి ప్రాజెక్ట్‌ లీడర్లు వాసంతి, రజియా, పుట్టపర్తి ప్రాజెక్టు లీడర్లు సుజాత, నాగమణి, మంజుల, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. తలుపుల : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా ఉద్యోగాలను తొలగిస్తామని ప్రభుత్వం బెదిరింపులకు దుర్మార్గమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జిఎల్‌ నరసింహులు అన్నారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో జీవో నెంబర్‌ 2 ప్రతులను దహనం చేశారు. నిర్బంధాలతో సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తే అంగన్వాడీలు మరింత ఉధతంగా పోరాడుతారే తప్ప భయపడే ప్రసక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు రజియా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బాబ్జాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఓబుళదేవర చెరువు : ఎస్మా జీవోను వెంటనే రద్దు చేయాలని అంగనవాడీలు, సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. మహమ్మదాబాద్‌ క్రాసింగ్‌ వద్ద 27వ రోజు సమ్మెలో భాగంగా ఓబుళదేరవచెరువు, అమడగూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్మా జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి శ్రీరాములు, అధ్యక్షులు కుళ్లాయప్ప, సెక్టార్‌ యూనియన్‌ లీడర్లు కిష్టమ్మ, పద్మ, మనిమల, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నల్లమాడ : అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద సోమవారం సమ్మె కొనసాగించారు. అంగన్వాడీల సమ్మెకు సిపిఎం మండల కార్యదర్శి గోవిందు, సిఐటియు జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు మద్దతు పలికారు. ఈసందర్భంగా నాయకులు, అంగన్వాడీలు వినూత్న నిరసన తెలిపారు. గోవిందా అంటూ మొక్కుకుంటా నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు వై రంగమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి, మేరిసుజాత, కమలమ్మ, అరుణమ్మ, గంగాదేవి, చెన్నమ్మతో పాటు పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. గాండ్లపెంట : జీవో నెంబర్‌ 2 నుంచి వెంటనే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీలు డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని అంగన్వాడీలు వర్షం వస్తున్నా లెక్కచేయకుండా నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు లక్ష్మిదేవి, సుజాత, భారతితో పాటు అధిసంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. నల్లచెరువు : అంగన్వాడీలపై ఎస్మాచట్టం ప్రయోగించడం దుర్మార్గమని సిఐటియు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్మా చట్టం ప్రతులను సోమవారం స్థానిక బస్టాండ్‌ కూడలిలో తగలబెట్టారు. సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని తెగేసి చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామకృష్ణ, జిల్లా రైతు సంఘం కౌన్సిల్‌ సభ్యులు శ్రీరాములు, వ్యవసాయ కార్మిక సంఘం రమేష్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు. కదిరి అర్బన్‌ : అంగన్వాడీలపై ఎస్మాను ప్రయోగించడానికి వ్యతిరేకిస్తూ సోమవారం అంగన్వాడీ వర్కర్లు టవర్‌ క్లాక్‌ వద్ద ఎస్మా జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా, ప్రజాస్వామ్యతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మాబున్నీసా, సుజాత, లక్ష్మిదేవి, సువర్ణ, మాధవి, రామలక్ష్మమ్మ, సిఐటియు నాయకులు జగన్మోహన్‌, రామ్మోహన్‌, ముస్తాక్‌ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్యా యాదవ్‌, ఆర్‌ సి పి జిల్లా కార్యదర్శి నాగన్న వారి పార్టీల తరపున అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు.సోమందేపల్లి : సమ్మెలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మండలంలోని అంగన్వాడీలు జ్యోతులు, కలశాలు తలమీద ఎత్తుకొని స్థానిక వాల్మీకి సర్కిల్‌ నుంచి అంబేద్కర్‌, ఎన్టీఆర్‌ సర్కిళ్ల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కల్పించాలి అంటూ నినాదాలు చేస్తూ స్థానిక శివాలయం, షిరిడీసాయిబాబా ఆలయంలో కలశాలు, జ్యోతులు సమర్పించారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శన మన్నారు. ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి దేవుడు కనువిప్పు చేయాలని ప్రార్థించామన్నారు. కార్యక్రమం లో చంద్రకళ, నాగరత్న, శోభ, అనురాధ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.పెనుకొండ : సమ్మెలో భాగంగా అంగన్వాడీలు కుంభకర్ణ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడీలు, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా కుంభకర్ణుడిలా నిద్రపోతున్న సిఎం జగన్‌ ఇకనైనా మేల్కొని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు తిప్పన్న, అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయమ్మ, బావమ్మ,సెక్టార్‌ లీడర్లు మాబున్నీసా, వరలక్ష్మి, అనిత, శ్యామలగౌరీ పాల్గొన్నారు.అమరాపురం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. వీరికి అగళి మండలం టిడిపి దళిత నాయకులు మద్దతు తెలిపారు. దీక్షలో సిఐటియు నాయకుడు మహబూబ్‌ఖాన్‌, ఎంపిటిసి నాగోజి, క్యాతప్ప, మంజునాథ్‌, గుండన్న, యూనియన్‌ లీడర్లు నాగవేణి, అనసూయమ్మ, మంజుల, చంద్రకళ, నాగరత్నమ్మ, సారక్క పాల్గొన్నారు.లేపాక్షి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మండలం లోని రైతులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరసింహప్ప, ధనమ్మ, రత్నమ్మ, భాగ్యమ్మ, శివమ్మ, రూప, శశికళ పాల్గొన్నారు. గోరంట్ల : అంగన్వాడీలు తహశీల్దార్‌ కార్యాలయం ముందు యథావిధిగా కొనసాగించారు. వీరికి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి పెద్దన్న మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.మడకశిర : పట్టణంలో అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం సరికాదని, ఇది ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం అన్నారు. టిఎన్‌ఎస్‌ఎఫ్‌ తాలూకా అధ్యక్షులు జవనడుకు రంగ పేర్కొన్నారు. పట్టణంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.

➡️