మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం

Dec 26,2023 22:03

పుట్టపర్తి నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు

    పుట్టపర్తి అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని జిల్లా మున్సిపల్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులు విధులను బహిష్కరించి మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. పుట్టపర్తి నగర పంచాయతీ కార్యాలయం వద్ద బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో మున్సిపల్‌ కార్మికులకు అనేక వాగ్దానాలు చేశారన్నారు. వాటిలో ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సిపిఎస్‌ రద్దు తదితర హామీలు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలం ఐదేళ్లు పూర్తి కావస్తున్నా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. కార్మికులందరినీ పర్మనెంట్‌ చేసి, ఇంక్రిమెంట్లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రావిటీ ఇవ్వాలన్నారు. కార్మికులకు అవసరమైన పనిముట్లు అందజేయాలన్నారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలనూ మున్సిపల్‌ కార్మికులకు వర్తింపచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు నిరవధికంగా సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల సమ్మెకు టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రవాణా రంగం జిల్లా కార్యదర్శి బాబావలి, పట్టణ సిఐటియు కార్యదర్శి పైపల్లి గంగాధర్‌, మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ నాయకులు పెద్దన్న, రామయ్య, నరసింహులు, నాగార్జున ఇంజినీరింగ్‌ విభాగం నాయకులు గణేష్‌, రమేష్‌, రామదాసు, డ్రైయినేజీ కార్మిక సంఘం నాయకులు నాగరాజు, వెంకటేష్‌, పోతులయ్య, పెద్దన్న పాల్గొన్నారు.

➡️