హత్యాయత్నం కేసు నమోదు చేయాలి : సిఐటియు

హిందూపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశ వర్కర్‌ను పరామర్శిస్తున్న సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

       హిందూపురం : గోరంట్ల సబ్‌ సెంటర్‌ లో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్‌ శబరి ఆత్మహత్యకు కారణమైన ఎంఎల్‌హెచ్‌పి గౌతమిని విధుల నుంచి సస్పెండ్‌ చేసి, ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. ఆత్మహత్యకు యత్నించి హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శబరిని సిఐటియు జిల్లా అధ్యక్షుడు జెడ్‌పి శ్రీనివాసులుతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడిన శబరి మాట్లాడుతు సబ్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఎంఎల్‌హెచ్‌పి గౌతమి తనను కావాలనే వేధింపులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వీపర్లు చేసే పనులను సైతం తనతోనే చేయిస్తూ చిత్రహింసలకు గురి చేస్తోందన్నారు. ఈ హింసలను భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డానని తెలియజేసింది. అనంతరం ఈఎస్‌.వెంకటేష్‌ మాట్లాడుతు గోరంట్ల సబ్‌ సెంటర్‌ లో విధులు నిర్వహిస్తున్న ఎంఎల్‌హెచ్‌పి గౌతమి ఆశా వర్కర్లను విధుల పేరుతో వేధింపులకు పాల్పడుతోందన్నారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆశా వర్కర్‌కు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామకష్ణ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

➡️