ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి

రాప్తాడులో స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలన అనంతరం అధికారులతో మాట్లాడుతున్న దీపక్‌రామచంద్ర తవారే

         అనంతపురం కలెక్టరేట్‌ : రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జెఎన్‌టియులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లను చేపట్టాలని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు దీపక్‌ రామచంద్ర తవారే ఆదేశించారు. శనివారం అనంతపురం నగరంలోని జెఎన్‌టియు కళాశాల ప్రాంగణంలో గల డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ భవనంలో సాధారణ ఎన్నికలు – 2024 కోసం రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ హాల్‌లను, కమీషనింగ్‌ రూమ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ రూమ్‌లను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలు, కమిషనింగ్‌ రూమ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ రూమ్‌లలో ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక బ్యారి కేడ్‌ లను ఏర్పాటు చేయాలని, రాజకీయ పార్టీల వారికి ప్రత్యేకంగా లోపలికి వెళ్లి బయటకు వచ్చేందుకు ఏర్పాట్లు ఉండాలన్నారు. ముందుగానే అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. అంతకుముందు నగరంలోని ఎస్‌ఎస్‌బిఎన్‌ కళాశాలలో సాధారణ ఎన్నికల కోసం రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి వసంత బాబు అధికారులు పాల్గొన్నారు.

➡️