కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుందాం

Apr 29,2024 22:06

ఉరవకొండలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం

                    వజ్రకరూరు : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమితోపాటు వైసిపి ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుందామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి మల్లికార్జున పిలుపునిచ్చారు. సోమవారం ఉరవకొండ పట్టణంలోని 1, 11వ వార్డుల్లో సిపిఎం, సిపిఐ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి పదేళ్లుగా టిడిపి, వైసిపి ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. అనంతరం కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ప్రజలను నట్టేట ముంచాయన్నారు. బిజెపికి కొమ్ముకాస్తూ టిడిపి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయన్నారు. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఉరవకొండ మండల కన్వీనర్‌ మధుసూదన్‌, కాంగ్రెస్‌ నాయకులు నిఖిల్‌నాథ్‌రెడ్డి, సోనియా సీన, అబ్బాస్‌, సుధాకర్‌, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.తండ్రి గెలుపు కోసం తనయుడు ప్రచారంవై.మధుసూదన్‌రెడ్డి గెలుపు కోసం తనయుడు వై.అవినాష్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా వజ్రకరూరు మండల పరిధిలోని పందికుంట గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్‌రెడ్డి కుమార్తె ప్రియా లిఖిత, కోడలు దర్శనారెడ్డి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పుట్టపర్తి అర్బన్‌ : దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఇండియా వేదిక అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం నల్లమాడ మండలంలోని దున్నికోట, పులగంపల్లి, ఎర్ర చెరువుపల్లి, వెంకటరెడ్డి పల్లి, మసకవంకపల్లి గ్రామాల్లో విస్తతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిడిపి, వైసీపీకి ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్లేనని అన్నారు. రైతుల పట్ల ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు. అందుకే రుణమాఫీ ప్రస్తావన ఇరుపార్టీల మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు. కేంద్రంలో బిజెపి రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో జగన్‌ పాలన అరాచకం, భూకబ్జాలతోనే సరిపోయిందని విమర్శించారు. ఈసందర్భంగా దోన్నికోటలో యనమల ప్రసాద్‌ నాయుడు కుటుంబంతో పాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి మధుసూదన్‌ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ సేవాదళ్‌ మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి, నల్లమాడ మండల అధ్యక్షులు పఠాన్‌ గౌస్‌, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు కదిరప్ప, సిపిఐ నాయకులు చంద్ర, గంగాద్రి, కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకులు సంతోష్‌ రెడ్డి, వాసుదేవ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, నరేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️