ప్రజానాయకుడు లోచర్ల పెద్దారెడ్డి : పల్లె

May 8,2024 22:25

విగ్రహావిష్కరణలో పాల్గొన్న నాయకులు

                  పుట్టపర్తి అర్బన్‌ : పేద బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితకాలం కృషి చేసిన వ్యక్తి లోచర్ల పెద్దారెడ్డి అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ప్రశాంతి గ్రామ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో లోచర్ల పెద్దారెడ్డి కాలనీలో నిర్వహించిన లోచర్ల పెద్దారెడ్డి విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ పెద్దారెడ్డి కరుడు కట్టిన కమ్యూనిస్టుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే గాక రాయలసీమ వ్యాప్తంగా పేద ప్రజల కోసం నిరంతరం పోరాడారని అన్నారు. విలువలతో కూడిన మానవతావాది అని తెలిపారు. చాలా ఏళ్లుగా ఆయన అజ్ఞాతవాసం కూడా చేశారన్నారు. అనంతరం లోచర్ల విజయభాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ మూడు నెలల క్రితం ఇదే కాలనీలో పెద్దారెడ్డి విగ్రహం ఆవిష్కరిస్తే కొందరు దుండగులు విగ్రహాన్ని మాయం చేశారని అన్నారు. దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన పనికి పాల్పడడం దుర్మార్గమన్నారు. తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న తాను ఎవరి బెదిరింపులకు ఒత్తిడిలకు లొంగనని, తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రెస్కో చైర్మన్‌ లాయర్‌ రాజశేఖర్‌, బుగ్గపల్లి రామ్మోహన్‌, కాంట్రాక్టర్‌ లక్ష్మీనారాయణ, పాముదుర్తి సర్పంచి కృష్ణమూర్తి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బీసీ గంగన్న, లోచర్ల పెద్దన్న, బాబు, సత్తి, ఆది తదితరులు పాల్గొన్నారు.

➡️