తాడిపత్రి రణరంగం

తాడిపత్రిలో రాళ్లు రువ్వుకుంటున్న టిడిపి వైసిపి మద్దతుదారులు

     తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రి నియోజకవర్గ కేంద్రం రణరంగాన్ని తలిపిస్తోంది. టిడిపి, వైసిపి గ్రూపుల మధ్య పోలింగ్‌ సందర్భంగా నెలకొన్న చిచ్చు దారికి రావడం లేదు. సోమవారం నాడు పట్టణంలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రారంభం అయిన వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా పట్టణంలో ఈ రెండు పార్టీల మధ్య దారులు ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నారు. ఈ దాడులతో తాడిపత్రిలో భయానక వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ రోజంతా గడిపారు. తాడిపత్రి పట్టణంలో వైసిపి కార్యకర్తలు పట్టణంలో ఉన్న టిడిపి నాయకుడు సూర్యముని ఇంటిపై మంగళవారం ఉదయం దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న టిడిపి నాయకులు ప్రతిదాడిగా రాళ్లురువ్వారు. ఈ నేపథ్యంలో ఇరువు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. టిడిపి, వైసిపి నాయకులు రాళ్లు రువ్వుకునే క్రమంలో అదుపు చేసేందుకు వెళ్లిన తాడిపత్రి పట్టణ సిఐ మురళీకష్ణ తలకు రాయి తగిలి గాయం అయ్యింది. వైసిపి నాయకులు సూర్యముని ఇంటిపై చేసిన దాడి విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌ రెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట టిడిపి మద్దతుదారులతో కలిసి ఆందోళనకు దిగారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. పెద్దారెడ్డి ఇంటి వద్దకు టిడిపి మద్దతుదారులు వెళ్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని గ్రహించిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ప్రత్యేక బలగాలను తాడిపత్రికి రప్పించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. అయినా టిడిపి మద్దతుదారులు ఏమాత్రం లెక్కచేయకుండా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటి వైపు వెళ్లారు. ఈ సమయంలో మార్గమధ్యంలో వైసిపి నాయకులు కూడా వందలాదిమంది కార్యకర్తలతో ఎదురుగా వచ్చారు. పట్టణంలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీ క్రీడా మైదానంలో ఇరు గ్రూపులు మరోసారి ఒకరిపైఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దాదాపు మూడు గంటలసేపు రాళ్లు విసురుకోవడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్‌ నెలకొంది. ఇందులో ఓ వైసిపి కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వైసిపి కార్యకర్తను ఆసుపత్రికి తరలించాగా పరిస్థితి విషమంగా అన్నట్లు వైద్యులు తెలిపారు. వైసిపి, టిడిపి మద్దతుదారులు దాడులు, ప్రతిదాడులను నిలువరిచేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. ఎంత సేపటికీ గొడవలు సర్దుమనగక పోవడంతో పోలీసులు కేంద్ర బలగాల సహాయంతో లాఠీఛార్జీ చేశారు. రాత్రి 8 గంటల సమయంలో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తాడిపత్రి ప్రజలు భయాందోళన మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎప్పుడు ఏ ఘటన చోటు చేసుకుంటోందన్న ఆందోళన తాడిపత్రి ప్రజల్లో కన్పిస్తోంది.

నామమాత్రంగా పోలీసు చర్యలు

       పట్టణంలో పోలింగ్‌ రోజున జరిగిన దాడికి ప్రతిదాడిగా మళ్లీ దాడులు జరుగుతాయన్న ఆలోచన పట్టణంలో నెలకొంది. పరిస్థితి ఇలా ఉన్నా పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మంగళవారం నాడు తాడిపత్రిలో ఇరువర్గాలు మరోసారి రాళ్ల దాడులకు పాల్పడే పరిస్థితి నెలకొంది. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి 144 సెక్షన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఇరు వర్గాలు రెచ్చిపోకుండా ఎప్పటికప్పుడు అరెస్టు చేసి చర్యలు చేపట్టాలని తాడిపత్రి పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.

గాయపడ్డ వైసిపి కార్యకర్త పరిస్థితి విషమం

     రాళ్లదాడుల్లో గాయపడిన కడప జిల్లా కొండాపురం మండలం కోడూరు గ్రామానికి చెందిన నాగేశ్వర్‌ రెడ్డి తలకు రాయి తగిలి తీవ్ర గాయం అయ్యింది. దీంతో హుటాహుటిన నాగేశ్వర్‌రెడ్డి స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించినట్లు వైసిపి నాయకులు తెలిపారు.

➡️