ఎవరి పల్లకి మోస్తున్నారు..?

విలేకరులతో మాట్లాడుతున్న రంగన అశ్వర్థ నారాయణ

        ధర్మవరం టౌన్‌ : మూడు నెలల క్రితం వరకు ఎన్నికల్లో ఎవరి పల్లికీ మోయమని తామే పల్లికి ఎక్కుతామనేలా మాట్లాడి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన స్థానికేతరుడికి మద్దతు తెలిపేలా చేనేత నాయకులు మాట్లాడడం అత్యంత దుర్మార్గమని ధర్మవరం కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి రంగన అశ్వర్థ నారాయణ తెలియజేశారు. శుక్రవారం నాడు పట్టణంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో సిపిఎం, సిపిఐ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు నెలల క్రితం చేనేతలంతా సమావేశమై చేనేతలు ఐక్యంగా ఉంటామని ఎవరి పల్లకి మోయమని చెప్పిన నాయకులు ఎన్నికలు రాగానే ఎన్డీఏ అభ్యర్థి పల్లికి మోసేందుకు ఎందుకు సిద్ధం అయ్యారని ప్రశ్నించారు. చేనేత నాయకునిగా తాను ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా 2014, 2019లో పోటీ చేశానని మళ్లీ మూడోసారి 2024లో పోటీ చేస్తున్నానని తెలియజేశారు. 2009లో సిపిఐ తరఫున కురుబ సామాజిక వర్గానికి చెందిన జగదీష్‌ పోటీ చేస్తే ఆయన్ను ఓడించారన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన బిజెపి అభ్యర్థి సత్యకుమార్‌పై కొందరు అత్యుత్సాహం చూపి మద్దతు ప్రకటిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానికున్ని, చేనేత వర్గానికి చెందిన తనను ఆదరించకపోగా చిన్నచూపు చూపడం ఎంతవరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ సత్తా చాటుతుందన్నారు. బిజెపి అభ్యర్థి అఫిడవిట్లో తన సతీమణి పేరును ఎందుకు పొందపరచలేదో ఒకసారి అందరూ ఆలోచన చేయాలన్నారు. ఇప్పటికైనా ధర్మవరం నియోజకవర్గంలో అధిక ఓటర్లు ఉన్న చేనేతలు ఇతరుల పల్లకీలు మోయడం మాని చేనేత వర్గానికి చెందిన తనను కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జంగాలపల్లి పెద్దన్న, ఎస్‌హెచ్‌.బాషా, సిపిఐ నాయకులు ముసుగు మధు పాల్గొన్నారు.

➡️