అనధికారిక ‘లిఫ్ట్‌’లు తొలగిస్తాం

ఎగువ భాగంలో అనధికారికంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాలతో దిగువ ప్రాంత భూములు బీళ్లుగా మారుతున్నాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. అనధికారిక లిఫ్ట్‌లను తొలగించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మండలంలోని

వ్యవసాయ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి

  • పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు

ఎగువ భాగంలో అనధికారికంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాలతో దిగువ ప్రాంత భూములు బీళ్లుగా మారుతున్నాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. అనధికారిక లిఫ్ట్‌లను తొలగించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మండలంలోని పెద్దబొడ్డపాడులో అగ్ని ప్రమాదానికి ఆహుతైన పంట పొలాలను అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఎగువ ప్రాంతాల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాలతో దిగువ ప్రాంతంలో భూములకు నీరందక ఇబ్బందులు పడుతున్నామని, వాటిని శాశ్వతంగా తొలగించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. దిగువ ప్రాంత రైతులకు సకాలంలో నీరందించేందుకు మదన గోపాలసాగరం డిట్యూరింగ్‌ ప్రతిపాదనలు త్వరలో మంజూరవుతాయని తెలిపారు. ఎటువంటి విపత్తు వచ్చినా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు అధైర్యపడ్డొద్దని భరోసానిచ్చారు. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన పంట పొలాల రైతులను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో వైసిపి సీనియర్‌ నాయకులు హనుమంతు వెంకటరావు, జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, సర్పంచ్‌ తమ్మినేని ఢిల్లీరావు, మాజీ సర్పంచ్‌ ఆనందరావు, వ్యవసాయ సహాయ సంచాలకులు మధు, మండల వ్యవసాయ అధికారి కిరణ్‌ వాణి తదితరులు పాల్గొన్నారు.

 

➡️