నాడి చూసే నాధుడే కరువు!

Jun 28,2024 21:11

సెలవులో ఒకరు… శిక్షణకు మరొకరు

రోగులకు తప్పని పాట్లు

ప్రజాశక్తి – మక్కువ  : గత రెండు రోజులుగా ఆసుపత్రికి వచ్చే రోగులకు నాడి చూసే నాధుడే కరువయ్యాడు. జిల్లా ఉన్నతాధికారుల వైఖరి వల్ల మండలంలోని శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ప్రజలకు అవస్థలు తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారులు వారికున్న అవసరాల నిమిత్తం బయటకు వెళ్లగా, వారి స్థానంలో ఎవరినైనా తాత్కాలికంగా నియమించి వైద్య సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ఉన్నతాధికారులు ఎవరూ చర్యలు చేపట్టడంలేదు. దీంతో గిరిజన ప్రాంత ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఎంత ఉదాసీనత ఉందో ఇట్టే అర్ధమవుతుంది. సుమారు పది కిలోమీటర్ల దూరానున్న నంద పంచాయతీ గిరిజనులు వైద్యం కోసం ఇక్కడకు వచ్చారు. అయితే వైద్యుల్లేకపోవడంతో వైద్యమందక నిరాశతో వెనుతిరుగుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు గిరిజన ప్రాంతాల ప్రజలకు అందుబాటులో లేకుండా ఓ మూలకు విసిరేసినట్లు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఇక్కడ పని చేసే సిబ్బంది విధులకు డుమ్మా కొడుతున్నా జిల్లా అధికారులకు మాత్రం పట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో ఎక్కడ ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేస్తున్నారు వారికే తెలియదని ఉద్యోగుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజువారీ తీసుకోవాల్సిన అటెండెన్స్‌ నమోదు కూడా వారానికి 10 రోజులకు తీసుకుంటూ రావడం ఇక్కడ పరిపాటిగా మారిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సిబ్బంది పరిస్థితిపై సమీక్షించి గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా కృషి చేయాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.

➡️