అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస), హరిశ్చంద్రపురం

డిఆర్‌ఎంకు వివరిస్తున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

* డిఆర్‌ఎంను కోరిన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి – ఆమదాలవలస, కోటబొమ్మాళి

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస), హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే వాల్తేరు డిఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ను కోరారు. రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా శ్రీకాకుళం రోడ్డు, హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్లకు గురువారం వచ్చిన డిఆర్‌ఎంను ఎంపీ కలిశారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆమదాలవలస గేటు వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం నుంచి అవతల ఎంపిడిఒ కార్యాలయం వైపు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ఊసవానిపేట వద్ద ఉన్న రైల్వే గేటుతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, అక్కడా ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలన్నారు. ఈ పనులకు అంచనాలను రూపొందించి అందజేస్తే రైల్వే మంత్రిత్వ శాఖతో మాట్లాడి అనుమతులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని డిఆర్‌ఎంకు తెలిపారు. విశాఖపట్నం నుంచి బరంపురం వరకు జాతీయ రహదారికి అనుకొని ఉన్న ఏకైక రైల్వేస్టేషన్‌ హరిశ్చంద్రపురం అని, ఇక్కడ సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగా ఉన్నాయని ఎంపీ వివరించారు. దీనిపై డిఆర్‌ఎం స్పందిస్తూ తన పరిధిలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానన్నారు. హరిశ్చంద్రపురంలో రూ.1.50 కోట్లతో మంజూరు చేసిన నడక వంతెన భూమిపూజ పనులను సంక్రాంతిలోగా ప్రారంభిస్తామన్నారు. అప్రోచ్‌ రోడ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్‌ సౌకర్యాలు, రెండో నంబరు ప్లాట్‌ఫారంపై అదనపు బుకింగ్‌ కౌంటర్‌ వంటి మౌలిక సదుపాయాలను ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద చేపడతామని చెప్పారు. గుణుపూర్‌ పాసింజర్‌ రైలు, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ హాల్ట్‌ తన పరిధిలో లేదని, రైల్వే బోర్డుకు సిఫారు చేస్తానని హామీనిచ్చారు. రైల్వేస్టేషన్‌ పరిధిలోని 50 ఎకరాల్లో వ్యాపార సముదాయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఎడిఆర్‌ఎం ఎ.కె గుప్తా, రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ మొదలవలస రవి, చీఫ్‌ బుకింగ్‌ సూపర్‌వైజర్‌ శివశంకర్‌, కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ గణేష్‌, పలువురు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️