‘ఉపాధి’ కూలీ మృతి

'ఉపాధి' కూలీ మృతి

రోదిస్తున్న కుటుంబసభ్యులు

ప్రజాశక్తి – నందిగాం

ట్రాక్టర్‌పై నుంచి జారిపడి మండలంలోని దిమ్మిడిజోలకు చెందిన ఉపాధి హామీ కూలీ గౌడు జగదీశ్వరి (30) బుధవారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దిమ్మిడిజోల సమీపంలోని సవరాపురం చెరువులో ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు. ఈ పనులకు వెళ్తున్న జగదీశ్వరి ఆలస్యం కావడంతో తొందరగా వెళ్లేందుకు అటువైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆపి ఎక్కింది. గ్రామ శివారుకు వచ్చేసరికి ట్రాక్టర్‌పై నుంచి జారిపడడంతో ఆమె తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలిలోని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త దుర్యోధన, కుమారుడు శరణ్‌, కుమార్తె హిమబిందు ఉన్నారు. కుమారుడు దిమ్మిడిజోలలో నాలుగో తరగతి, కుమార్తె డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహ్మద్‌ అమీర్‌ ఆలీ తెలిపారు.

➡️