కరువు పరిస్థితులతో నష్టపోయిన అన్నదాతలు

ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గురువారం

సిఎం సారూ…సమస్యలు వినరూ

  • జీడి మద్దతు ప్రకటన కోసం రైతాంగం ఎదురుచూపులు
  • ఆధునికీకరణకు నోచని వంశధార ఎడమ కాలువ
  • అపరిష్కృతంగానే షట్టర్ల సమస్య
  • నేడు సిఎం జగన్మోహన్‌ రెడ్డి జిల్లాకు రాక
  • పలాసలో కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి మకరాంపురంలో వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు ప్రారంభం

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. పలాసలో నూతనంగా నిర్మించిన కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి, కంచిలిలో వైఎస్సార్‌ సుజలధార మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అనంతరం కాశీబుగ్గ రైల్వే మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో తిష్ట వేసిన అనేక సమస్యల పరిష్కారానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా జిల్లా రైతాంగం కరువుతో అల్లాడిపోతోంది. జీడిపిక్కలకు మద్దతు ధర, ఆర్‌బికెల ద్వారా కొనుగోలుపై ప్రభుత్వం తరుపున మంత్రులు ఇచ్చిన మాట నేటికీ నెరవేరలేదు. ప్రభుత్వాలు మారుతున్నా వంశధార ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు ఆధునికీకరణకు నోచుకోవడం లేదు. సిఐడి కేసులతో వంశధార షట్టర్ల అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. సిఎం చొరవ చూపితే గానీ ఆ సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వీటిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించే నిర్ణయాలపై అందరూ ఆశలు పెట్టుకున్నారు.జిల్లాలో ఈ ఏడాది కరువు పరిస్థితుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్‌లో 4,37,153 ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా 3,81,833 ఎకరాల్లోనే రైతులు పంటలు వేయగలిగారు. వరి విషయానికి వస్తే 3,98,750 ఎకరాల్లో వేయాల్సి ఉండగా 3,53,325 ఎకరాల్లో వేశారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో 15 మండలాల పరిధిలో 20,813 ఎకరాల్లో వరి ఎండిపోయింది. ఇతర జిల్లాలతో పోలీస్తే రాష్ట్రంలో ఇక్కడ ఆలస్యంగా సాగు మొదలవుతుంది. కానీ ప్రభుత్వం సెప్టెంబర్‌ 30 వరకు ఉన్న పరిస్థితులనే పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలను ప్రకటించింది. అక్టోబర్‌ వర్షాపాతాన్ని పరిగణనలోకి తీసుకుని కరువు మండలాల జాబితాలో జిల్లాకు చోటు కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపారు.ఆధునికీకరణకు నోచని వంశధార కాలువలువంశధార ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచి కాలువలు ఆధునికీకరణ పనులకు నోచుకోలేదు. ప్రధానంగా ఎడమ కాలువ పరిస్థితి దయనీయంగా ఉంది. బ్యారేజీలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న రోజుల్లోనూ 1600 క్యూసెక్కులకు మించి విడిచిపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఆధునికీకరణ పనులకు రూ.834 కోట్లు అవసరమని 2021-22 కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ (షెడ్యూల్‌ స్టాండర్డ్‌ రేట్స్‌)తో నివేదికను గతేడాది పంపారు. ఏడాది గడిచినా ఇప్పటివరకు ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. గొట్టాబ్యారేజీ కుడి కాలువ ప్రధాన కాలువదీ అదే దుస్థితి. కాలువ గట్లు కోతకు గురయ్యే ప్రాంతంలో సిసి లైనింగ్‌ పనుల కోసం 2021-22లో 18.45 కోట్లతో అంచనాలతో రూపొందించిన ప్రతిపాదనలూ పెండింగ్‌లోనే ఉన్నాయి.షట్టర్ల సమస్యకు చూపాలి ఓ పరిష్కారంవంశధార శివారు భూముల సాగునీటికి షట్టర్ల కుంభకోణం కేసు అడ్డంకి మారింది. షట్టర్ల కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై 2009లో సిఐడి కేసు నమోదు చేసింది. దీనిపై నేటికీ హైకోర్టులో విచారణ సాగుతోంది. ఘటన జరిగి 13 ఏళ్లు అవుతున్నా, నేటికీ విచారణ కొలిక్కి రాలేదు. దీంతో కాలువలపై కొత్త షట్టర్లను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. సిఎం చొరవతోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది.మత్స్యకారులకు లేని కోల్డ్‌ స్టోరేజీలుజిల్లాలో 193 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉన్నా, ఎక్కడా ఒక్క కోల్డ్‌ స్టోరేజ్‌ లేదు. దీంతో మత్స్యకారులు ఏ రోజు మత్స్య సంపదను ఆ రోజే అమ్ముకోవాల్సి వస్తుండడంతో, సరైన ధర దక్కడం లేదు. పాలకులు మారుతున్నా కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్మాణం మత్స్యకారులకు నెరవేరని కోరికగానే మిగిలింది. తమ పిల్లలను చదివించుకునేందుకు ఆశ్రమ పాఠశాల కావాలని మత్స్యకారులు చాలా కాలంగా అడుగుతున్నారు. భావనపాడు పోర్టు నిర్మాణంతో భావనపాడు, గెద్దలపాడు ప్రాంతాల్లో మత్స్యకారులకు ఆ ప్రాంతంలో చేపల వేట సాధ్యపడదని, జగన్నాథపురం ప్రాంతంలో మినీ జెట్టీ నిర్మాణం చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు.ప్రస్తుతానికి సూపర్‌ స్పెషాలిటీ సేవలేఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 సెప్టెంబరులో పలాసకు కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను మంజూరు చేసింది. అందుకనుగుణంగా ఆస్పత్రి నిర్మాణానికి నిధుల కేటాయింపు, వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను మంజూరు చేసింది. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. కిడ్నీ వ్యాధులపై ఈ ప్రాంతంలో రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం సూపర్‌ స్పెషాల్టీ సేవల వరకే అందనున్నాయి. ఇందుకు సంబంధించి మొత్తం 60 మంది వైద్యులను భర్తీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 56 మందిని నియమించారు. కీలకమైన నెఫ్రాలజీ విభాగానికి మూడు పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, ఒక్కరిని మాత్రమే నియమించి మరో రెండు పోస్టులను ఉద్యోగోన్నతి ద్వారా భర్తీ చేయనున్నారని తెలిసింది. నర్సింగ్‌ సేవల కోసం 60 మంది సిబ్బంది అవసరం కాగా 46 మందిని నియమించారు. ఆస్పత్రిలో 40 మంది సహాయ సిబ్బంది అవసరం కాగా 15 మందిని నియమించారు. ఆపరేషన్‌ థియేటర్‌లో 20 శాతం మేర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంకా సమకూర్చుకోవాల్సి ఉంది. రీసెర్చ్‌కు సంబంధించిన పరికరాలు రాకపోవడంతో ప్రస్తుతానికి మాత్రం కొంతవరకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందనున్నాయి. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకురావడంతో బడ్జెట్‌ కేటాయింపులు, మౌలిక వసతులు, వైద్యుల నియామకాలకు ఇబ్బంది ఉండదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఉద్దానం ప్రాంత ప్రజలు వైద్య సేవల కోసం బరంపురం, విశాఖ వెళ్లాల్సిన అవసరం ఉండదంటూ కిడ్నీ బాధితుల తరుపున పోరాడుతున్న నాయకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఒక్క అడుగూ పడని ఫిషింగ్‌ హార్బర్‌ పనులుసంతబొమ్మాళి మండలం మూలపేటలో ఈ ఏడాది ఏప్రిల్‌ 19న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. అదే రోజున ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. పోర్టు పనులు చాలా వేగంగా సాగుతున్నా, హార్బర్‌ పనుల్లో మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు.జీడి మద్దతు ప్రకటనపై రైతుల ఆశలుజీడి పిక్కలకు ఏప్రిల్‌ రెండో వారం వరకు 80 కేజీల బస్తాకు రూ.10,500 వరకు చెల్లించారు. పంట చేతికి రావడం, రైతుల వద్ద పుష్కలంగా పిక్కలు ఉండడంతో క్రమేణా ధర తగ్గిస్తూ రూ.8 వేలు వరకు ఇచ్చారు. దళారులు, వ్యాపారుల నుంచి కాపాడాలంటే 80 కేజీల బస్తాకు రూ.16 వేలు, ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు దీక్షలు, ధర్నాలు తదితర రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. జీడిపిక్కలకు మద్దతు ధర, కొనుగోలు అంశంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందంటూ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ హామీనిచ్చి నాలుగు నెలలు గడచినా ఇప్పటివరకు అమలు కాలేదు.

➡️