చంద్రబాబు పాలన అంతా వంచనే

చంద్రబాబును నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి

  • అధికారం ఇవ్వాలని అడిగే హక్కు లేదు
  • రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, మెళియాపుట్టి

చంద్రబాబును నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వంచించారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. వైసిపి సామాజిక సాధికార యాత్ర సందర్భంగా పాతపట్నం కూడలిలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబుకు మళ్లీ ఓటు వేయాలని ప్రజలను అడిగే హక్కు లేదన్నారు. టిడిపి హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను బెదిరించి భయపెట్టి పాలించారని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా, పేదరికం మాత్రమే చూసి రూ.2.40 లక్షల కోట్లను సంక్షేమ పథకాల రూపంలో అందించారని చెప్పారు. పథకాల కోసం ఏ ఒక్కరైనా ఎవరికైనా ఒక్క పైసా లంచం ఇచ్చారా అని ప్రశ్నించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాలనాపరమైన సంస్కరణలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, టిడిపి ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యంగా ఉండేదన్నారు. సంక్షేమ పథకాల అమల్లో పైసా లంచం తీసుకున్నట్లు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని టిడిపి నాయకులకు సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రూ.1800 కోట్లు మంజూరు చేసారని తెలిపారు. కాగువాడలో ఎనిమిది నెలల కాలంలో రూ.11 కోట్లతో కాగువాడ బ్రిడ్జిని నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వంశధార నిర్వాసితులకు అన్యాయం చేసిందని, వైసిపి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్వాసితులకు అదనంగా రూ.216 కోట్ల పరిహారం ఇచ్చారని తెలిపారు. సభలో వైసిపి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వై.వి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్‌, గొర్లె కిరణ్‌ కుమార్‌, వి.కళావతి, కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు.

 

➡️