చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు

ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

  • గ్రేవ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం
  • ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహించాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో గత నెలలో జిల్లాలో నమోదైన గ్రేవ్‌ కేసులైన ప్రాపర్టీ, హత్య, అత్యాచార, ఎస్‌సి, ఎస్‌టి, పోక్సో కేసులు తదితర వాటిపై సర్కిల్‌ వారీ పోలీసు అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం, నగదు అక్రమ తరలింపు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలని ఆదేశించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది సంయుక్తంగా క్షేత్రస్థాయిలో దాడులు చేపట్టాలన్నారు. అపరిష్కృతంగా ఉన్న తీవ్రమైన (గ్రేవ్‌) నేరాల్లో సమగ్ర దర్యాప్తుతో కేసుల్లో పురోగతి సాధించాలన్నారు. ప్రాపర్టీ కేసుల్లో కచ్చితమైన ఆధారాలతో దర్యాప్తు చేయాలన్నారు. కేసుల నమోదు, దర్యాప్తు, నిందితుల అరెస్టు, ఛార్జిషీట్‌ దాఖలు వరకు సమగ్ర విచారణ చేయాలని సూచించారు. కేసుల ఛేదన, పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. పోక్సో కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు చేయాలని సూచించారు. రాత్రి గస్తీని బలోపేతం చేసి అధికారులు తరువుగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ముఖ్య కూడళ్లు, బ్యాంకులు, వ్యాపార సముదాయాల వద్ద సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఎఎస్‌పి జె.తిప్పేస్వామి, డిఎస్‌పిలు డి.బాలచంద్రారెడ్డి, వై.శృతి, నాగేశ్వర రెడ్డి, ఎస్‌.వాసుదేవ్‌, సిహెచ్‌.జి.వి ప్రసాదరావు, విజరు కుమార్‌, సిఐలు పాల్గొన్నారు.

 

 

➡️