జిల్లా వెనుకబాటు… పాలకుల పాపమే

జిల్లా వెనుకబాటుకు పాలకుల పాపమే శాపమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్‌

రాష్ట్ర విభజన తర్వాత ఒక్క పరిశ్రమ రాలేదు

వ్యవసాయంలోనూ ఆదాయం తగ్గింది

ప్రజా ప్రణాళికతోనే సమగ్రాభివృద్ధి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లా వెనుకబాటుకు పాలకుల పాపమే శాపమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎవిఎస్‌ భవన్‌లో ఆదివారం నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో 32 శాతం పట్టణీకరణ జరిగితే జిల్లాలో 17 శాతమే ఉందన్నారు. ఉపాధి లేక ఇక్కడ్నుంచి వలసలు వెళ్లిపోవడం ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని సూచిస్తోందని చెప్పారు. జిల్లాలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడుతుండగా, ఆ రంగం ద్వారా 40 శాతం ఆదాయమే వస్తోందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాకు ఒక్క పరిశ్రమ రాలేదని చెప్పారు. కొత్తగా పరిశ్రమలు రాకపోగా జిల్లాలో ఉన్న చక్కెర, జ్యూట్‌ పరిశ్రమలు సైతం మూతపడ్డాయని చెప్పారు. కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేసి జిల్లాను డంపింగ్‌ యార్డుగా మార్చేశారని విమర్శించారు. జిల్లా ప్రజల తలసరి ఆదాయం పెంచాలంటే, పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాల్సిన అవసరముందన్నారు. జీడి పిక్కలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని చెప్పారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా, పంటలకు గిట్టుబాటు ధర చెల్లించకుండా జిల్లా అభివృద్ధి, ప్రజల ఆదాయం పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధికి ప్రత్యామ్నాయ ప్రజా ప్రణాళిక అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి, ఆ పార్టీతో అంటకాగుతున్న టిడిపి, వైసిపి అభివృద్ధి చేయలేవన్నారు. వామపక్షాలతోనే ప్రగతి సాధ్యపడుతుందని ఉద్ఘాటించారు.ప్రజలను సన్నద్ధం చేయాలిఎన్నికలు వస్తున్న తరుణంలో జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రత్యామ్నాయ ప్రజా ప్రణాళికకు అనుగుణంగా ప్రజలను సన్నద్ధం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ అన్నారు. ఓట్ల కోసం వైసిపి, టిడిపి రకరకాల హామీలతో ప్రజల ముందుకు వస్తాయని, ఈ నేపథ్యంలో ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడే అంశాలను అజెండాగా ఉంచేలా ప్రజలను సన్నద్ధం చేయాలన్నారు. జిల్లాలో విస్తారమైన సముద్రతీరం, వనరులను ఎలా ఉపయోగించుకోవాలో, కార్పొరేట్ల దోపిడీ నుంచి ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం మినీ ఇండియా వంటిదని, ఇక్కడ అన్నిరకాల పంటలు, విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపారు. జిల్లాలో మైనర్‌ ఇరిగేషన్‌లో భాగంగా ఉన్న చెరువుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు.సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.నాగమణి మాట్లాడుతూ అధికార, ప్రతిపక్ష పార్టీలకు జిల్లా అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. జిల్లాలో ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో పాలకులు వైఫల్యం చెందారని విమర్శించారు. సభాధ్యక్షులు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ జిల్లాలోని నీటి వనరునలు ఉపయోగించుకుని రెండు పంటలకు నీళ్లు అందిస్తే రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తే వలసలను నివారించవచ్చని సూచించారు. సదస్సులో మేధావులు, విద్యావంతులు, ప్రజా, కార్మిక, రైతుసంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.ప్రజల కేంద్రంగా అభివృద్ధి కావాలిఉపాధి, విద్య, వైద్యం, కనీస వేతనాలు వంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కావాలి తప్ప కార్పొరేట్ల అభివృద్ధి కాదని పూర్వ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌ శర్మ అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు అధ్యక్షతన నిర్వహించిన ‘విద్య-వైద్యం’ అంశంపై గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు విజెకె మూర్తి పేపర్‌ ప్రజెంటేషన్‌ చేశారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ పాలకులు కార్పొరేట్ల పల్లకీని మోయడం మానేస్తే అభివృద్ధి సాధ్యమేనని చెప్పారు. భూముల రేట్లు, భవంతుల నిర్మాణాలు అభివృద్ధి కాదని, సామాన్య ప్రజల బతుకులు మారితేనే అభివృద్ధి అని స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయకుండా వేరే ప్రత్యామ్నాయం లేదని తేల్చిచెప్పారు. విద్య ప్రయివేటీకరణతో ఒక తరం యువత తీవ్రంగా నష్టపోవడంతో పాటు కొత్త తరంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్‌తో నష్టంజిల్లాలో చాలా ప్రాజెక్టులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండిపోవడం వల్లే అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి కాలేదని నీటిపారుదల విశ్రాంత చీఫ్‌ ఇంజినీరు ఉప్పలపాటి నారాయణరాజు అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ‘వ్యవసాయం-సాగునీటి ప్రాజెక్టులు’ అంశంపై నీటిపారుదల విశ్రాంత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎస్‌.కొండలరావు పేపర్‌ ప్రజెంటేషన్‌ చేశారు. ఈ సందర్భంగా నారాయణరాజు మాట్లాడుతూ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండడానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు వ్యవస్థలో ఉన్న లోపాలూ కారణమేనన్నారు. ఒడిశాతో ఉన్న నీటి వివాదాలను ఏళ్లు గడుస్తున్నా పరిష్కరించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిబ్యులన్‌ తీర్పే అంతిమ నిర్ణయంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మేలు చేసే విధానాలతో మంచి పాలన అందించే ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. ప్రజల చైతన్యంతోనే అది సాధ్యపడుతుందన్నారు.ఆదాయం తగ్గుదలతో అభివృద్ధిపై ప్రభావంజిల్లాలో వ్యవసా యంపై వస్తున్న ఆదాయం తగ్గడంతో అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌ బి.గంగారావు అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.సింహాచలర అధ్యక్షతన నిర్వహించిన ‘పారిశ్రామికీకరణ-ఉపాధి అవకాశాలు’ అంశంపై సిఐటియు సీనియర్‌ నాయకులు కె.శ్రీనివాసు పేపర్‌ ప్రజెంటేషన్‌ చేశారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ సాంప్రదాయకంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్న రైతుల ఆదాయం తగ్గుతోందని, వారిని ఇతర రంగాలకు మళ్లించి ఆదాయం పెరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేసి, దాన్నే అభివృద్ధిగా పాలకులు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మూలపేట పోర్టులో ప్రభుత్వమే పెట్టుబడులు పెడితే పది వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని, ప్రయివేట్‌ పెట్టుబడులపై ఆధారపడితే అభివృద్ధి ఉండదని చెప్పారు. కొత్తగా వస్తున్న కంపెనీలు స్థానికులకు ఉపాధి కల్పించకుండా వేరే ప్రాంతం నుంచి కార్మికులను తీసుకోవడంతో, పనుల్లేక వేరే ప్రాంతానికి జిల్లావాసులు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

➡️