జీడి గిట్టుబాటు ధర హామీ ఏమైంది?

రాష్ట్ర ప్రభుత్వం జీడి

సమావేశంలో మాట్లాడుతున్న వామపక్ష నాయకులు

  • ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి
  • టిడిపి వైఖరి స్పష్టం చేయాలి
  • వామపక్ష నాయకుల డిమాండ్‌

ప్రజాశక్తి – పలాస

రాష్ట్ర ప్రభుత్వం జీడి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. కాశీబుగ్గలోని సిపిఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్‌ జిల్లా కార్యదర్శులు డి.గోవిందరావు, చాపర వెంకటరమణ, వంకల మాధవరావు, లిబరేషన్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మద్దిల మల్లేశ్వరరావు మాట్లాడారు. గిట్టుబాటు ధర కోసం జీడి రైతులు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. జీడికి గిట్టుబాటు ధరపై టిడిపి తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ప్రతిరోజూ దుమ్మెత్తిపోసుకుంటున్న వైసిపి, టిడిపి నాయకులు జీడి గిట్టుబాటు ధరపై మాత్రం నోరు మెదపడం లేదని విమర్శించారు. పలాస పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన సందర్భంగా చర్చించి గిట్టుబాటు ధర ప్రకటిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం జీవనాడైన జీడి రైతుల పక్షాన ఉంటుందా?, దళారుల పక్షాన ఉంటుందా? చెప్పాలని డిమాండ్‌ చేశారు. జీడిపప్పు ధర రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతుంటే, జీడిపిక్క ధర పాతాళానికి పోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వమే రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేరళ వలే జీడి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, స్థానిక జీడిపిక్కలు పూర్తిగా కొనుగోలు చేసిన తర్వాతే విదేశీ పిక్కలు దిగుమతికి అనుమతించాలన్నారు. విదేశీ పిక్కలు దిగుమతికి అధిక సుంకాలను పెంచాలని, జీడీ పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిపిఐ నాయకులు చాపర వేణు, సిపిఎం నాయకులు ఎన్‌.గణపతి, లిబరేషన్‌ పార్టీ నాయకులు పి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️