తెప్ప బోల్తా పడి మత్స్యకారుడు మృతి

సముద్రంలో వేటకు వెళ్లిన

ఎర్రయ్య మృతదేహం

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

వేటకు వెళ్లిన తెప్ప బోల్తా పడడంతో కొత్తపేటకు చెందిన మత్స్యకారుడు గుంటు ఎర్రయ్య (58) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం సాయంకాలం ఐదున్నర గంటల సమయంలో మృతుడు మరో ఇద్దరు వ్యక్తులు కొండ పున్నయ్య, వంక లింగరాజుతో కలిసి తెప్పపై సముద్రంలో చేపలు వేటకు వెళ్లాడు. తెప్ప బయలుదేరిన 20 నిమిషాలకే అలలు దాటికి కెరటాల ఉధృతి ఎక్కువ రావడంతో తెప్ప అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఎర్రయ్య సముద్రంలో పడిపోయాడు. మిగిలిన ఇద్దరూ ఎర్రయ్యను తెప్పలోకి చేర్చి సపరియలు చేశారు. అప్పటికే కెరటాల దెబ్బకు సొమ్మసిల్లిన ఎర్రయ్య కాసేపటికి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని సముద్ర ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడిని భార్య గౌరి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలందరికీ వివాహమైంది. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మధుసూదనరావు మృతదేహాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️