సాగు భూములపై హక్కులు కల్పించండి

మండలంలోని తోటాడ రెవెన్యూ

తహశీల్దార్‌ను ప్రశ్నిస్తున్న రైతులు

  • తహశీల్దార్‌ను కోరిన తోటాడ రైతులు

ప్రజాశక్తి – ఆమదాలవలస

మండలంలోని తోటాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 121లోని భూములపై హక్కులు కల్పించాలని తహశీల్దార్‌ ఎస్‌.గణపతిరావును సాగు రైతులు కోరారు. తోటాడ గ్రామంలో సర్పంచ్‌ మెట్ట శారద ఆధ్వర్యాన సమగ్ర భూ రీ సర్వేపై మంగళవారం గ్రామసభను నిర్వహించారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన రైతులు తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. గ్రామానికి చెందిన తాండ్ర రామారావు, తాండ్ర ప్రకాష్‌ మాట్లాడుతూ మూడు తరాలుగా గ్రామానికి చెందిన 2,200 మంది రైతులు సర్వే నంబరు 121లోని 199 ఎకరాల వ్యవసాయ భూములను సాగు చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ భూములను ఇనాం భూములుగా చూపిస్తూ ప్రభుత్వం మారిన ప్రతిసారీ రైతులను మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రీ సర్వేలోనైనా జిరాయతీ భూములుగా గుర్తించి, పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. 1961, 1994లో అప్పటి ప్రభుత్వాలు రెండుసార్లు సర్వే చేపట్టాయని అడంగల్‌, ఎఫ్‌ఎంబిలో రైతులు నమోదై ఉన్నారని తెలిపారు. తప్పుడు పద్ధతుల్లో రికార్డులను మాయం చేసి అప్పటి అధికారులు రైతులకు అన్యాయం చేశారని వాపోయారు. గత టిడిపి ప్రభుత్వం చుక్కల భూమిగా నమోదు చేసిందని, వైసిపి ప్రభుత్వం అదే రీతిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తహశీల్దార్‌ గణపతిరావు మాట్లాడుతూ భూ సర్వేతో నాలుగు నెలల్లో రైతులకు న్యాయం జరుగుతుందని హామీనిచ్చారు. ఈలోగా ఎన్నికల కోడ్‌ వస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలు కొత్త పథకాల మంజూరుకు వర్తిస్తాయని, ప్రస్తుతం జరుగుతున్న సర్వేకు వర్తించదని తహశీల్దార్‌ బదులిచ్చారు. ఒకవేళ ప్రభుత్వమే మారితే సర్వే పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నించగా, వచ్చే ప్రభుత్వ విధివిధానాలపై ఆధారపడి ఉంటుందని తహశీల్దార్‌ తెలిపారు. రైతులకు న్యాయం చేస్తామని, అపోహలు వీడి రీ సర్వేకు సహకరించాలని కోరారు. సభలో భూ సర్వే డిటి కిరణ్‌ కుమార్‌, ఆర్‌ఐ శిరీష, సర్వేయర్‌ బొడ్డేపల్లి గోపి, రైతులు పొన్నాడ గణపతిరావు, తాండ్ర శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️