11, 12న ఆశావర్కర్ల 36 గంటల ధర్నా

నీస వేతనం చెల్లింపు, పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 11, 12 తేదీల్లో కలెక్టరేట్‌ వద్ద 36 గంటల ధర్నా చేపడుతున్నట్లు

వినతిపత్రం అందజేస్తున్న ఆశా యూనియన్‌ నాయకులు

  • డిఎంహెచ్‌ఒకు ధర్నా నోటీసు అందజేత

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

కనీస వేతనం చెల్లింపు, పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 11, 12 తేదీల్లో కలెక్టరేట్‌ వద్ద 36 గంటల ధర్నా చేపడుతున్నట్లు ఆశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కె.నాగమణి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.ధనలక్ష్మి, జి.అమరావతి తెలిపారు. ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈమేరకు నగరంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో డిఎంహెచ్‌ఒ మీనాక్షిని సోమవారం కలిసి ధర్నా నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశావర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్నిరకాలైన సెలవులు, రిటైర్మెంట్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆశావర్కర్ల నియామకాల్లో రాజకీయ జోక్యాన్ని తొలగించి, ప్రభుత్వమే నియామకాలు చేపట్టాలని కోరారు. రిటైర్మెంట్‌ కాలాన్ని 62 ఏళ్లకు పెంచడంతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. 18 ఏళ్లుగా ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నా, ఆశావర్కర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించడం లేదన్నారు. తక్షణమే కార్మికులుగా గుర్తించి ఇతర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు. 60 ఏళ్లు వచ్చే వరకు పనిచేయించుకుని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించకుండానే తొలగించడం సరికాదన్నారు. విధినిర్వహణలో ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో చాలామంది ఆశావర్కర్లు అర్ధాంతరంగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆశావర్కర్లకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆశావర్కర్లను రోజూ విలేజ్‌ క్లినిక్‌, సచివాలయాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాలని, క్లినిక్‌లు క్లీన్‌ చేయడం, ఒపి వర్క్‌, అటెండర్‌ పనులు, రెండుపూటలా రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని అధికారులు వేధిస్తున్నారని విమర్శించారు. రికార్డుల నిర్వహణతో పాటు సొంత డబ్బులతో కొనాలని, సంబంధం లేని ఆన్‌లైన్‌ పనులను సొంత ఫోన్‌తో చేయాలని వేధించడం తగదన్నారు. సెలవుల్లేక అనేక మంది అనారోగ్యాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశావర్కర్లకు సంబంధం లేని పనులు చేయించడం ఆపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రటరీల నియామకాల్లో ఆశాలకు వెయిటేజి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా నాయకులు కె.జ్యోత్స్న, ఎస్‌.సుశీల, ఎస్‌.కళావతి తదితరులు పాల్గొన్నారు.

 

➡️