17,600 మందికి ‘జగనన్న తోడు’

జిల్లాలో జగనన్న తోడు పథకం

నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

  • రూ.18.62 కోట్ల రుణాలు మంజూరు
  • 24,740 మందికి రూ.52.18 లక్షల వడ్డీ జమ
  • కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో జగనన్న తోడు పథకం కింద 17,600 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.18.62 కోట్ల రుణాలను జమ చేసినట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. మరో 24,740 మందికి రూ. 52.18 లక్షల వడ్డీని జమ చేసినట్లు చెప్పారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జగనన్న తోడు కార్యక్రమంలో లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులు రుణాలు తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించిన వారికి జగనన్న తోడు పథకం ద్వారా తిరిగి రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. నాలుగో విడత వడ్డీని ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఈ పథకం వల్ల తోపుడుబళ్లు, సంప్రదాయ వృత్తి కళాకారులు, ఫుట్‌పాత్‌లపై, ప్రజా, ప్రైవేట్‌ స్థలాల్లో తోపుడుబళ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న వారు, తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు, సైకిల్‌, మోటార్‌ సైకిల్‌, ఆటోలపై వ్యాపారం చేసుకుంటున్న వారు, చేతివృత్తిదారులు, కళాకారులు, తదితర వ్యాపారులు తమ రోజువారీ వ్యాపార మూలధనం కోసం ప్రైవేట్‌, వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా వారి ఆదాయాలను మెరుగుపరచడానికి రూ.13వేలు వంతున సున్నా వడ్డీ రుణాలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, ఎల్‌డిఎం ఎం.సూర్యకిరణ్‌, మెప్మా పీడీ కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️