అచ్చెన్నకు వ్యవసాయ శాఖ

మంత్రిత్వశాఖలపై
  • మత్స్య, పశుసంవర్థకం కూడా ఆయనకే అప్పగింత
  • ప్రభుత్వ శాఖల కేటాయింపు

* పార్టీ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసిన అధిష్టానం

  • 17న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడితో కలిసి జిల్లాకు రాక

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

మంత్రిత్వశాఖలపై రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. ఈనెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రివర్గ సభ్యులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేసినా, శాఖల కేటాయింపు జరగలేదు. రెండు రోజుల కసరత్తు అనంతరం శుక్రవారం మంత్రులకు శాఖలు కేటాయించారు. జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కింజరాపు అచ్చెన్నాయుడుకి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ పాటు మత్స్య, పశుసంవర్థకశాఖనూ అప్పగించారు. మంత్రిత్వశాఖ కేటాయింపుపై అచ్చెన్న అనుచరులు కొంత నిరాశకు గురయ్యారు. ఆయనకు హోంశాఖ కేటాయిస్తారని వారు ఆశించడమే అందుకు కారణం.వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రిగా నియమితులైన అచ్చెన్నాయుడును వైసిపి ప్రభుత్వం కేసులతో వేధించిన సందర్భంలో పార్టీ అధికారంలోకి వస్తే, తనకు హోంశాఖ కేటాయించాలని ఒకట్రెండు సందర్భాల్లో కోరారు. ఎన్నికల ప్రచారం సమయంలోనూ కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, బాబారు గెలిస్తే హోంశాఖ మంత్రి అవుతారంటూ చెప్పుకొచ్చారు. దీంతో తప్పనిసరిగా ఆయనకు హోంశాఖ వస్తుందని అంచనా వేసుకున్నారు. అచ్చెన్నాయుడుకి అప్పగించిన శాఖలు కూడా మరీ అంత ప్రాధాన్యం ఉన్న శాఖలేమీ కావనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను వ్యవసాయపరంగా అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు కేటాయింపులో ప్రతిసారీ జిల్లాకు కావాల్సినంత మేర రాకపోవడంతో, రైతులు బహిరంగ మార్కెట్లలో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో చాలా సందర్భాల్లో వర్షాల్లేక పంటలు ఎండిపోయినా, కరువు జాబితాలో ఆయా మండలాలకు చోటు దక్కలేదు. విత్తనాలు చల్లే విషయంలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లాలో అక్టోబరులోనూ ఆ ప్రక్రియ నడుస్తోంది. ప్రభుత్వం మాత్రం సెప్టెంబరు వరకు ఉన్న వర్షపాతాన్నే పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలను ప్రకటిస్తూ వస్తోంది. గతేడాది ఇక్కడి పరిస్థితిపై అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినా, కరువు జాబితాలో చోటు దక్కలేదు. వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఉన్న నేపథ్యంలో వ్యవసాయ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది.మత్స్యశాఖ అప్పగింత పోర్టు పనుల పర్యవేక్షణకేనా?వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు మత్స్యశాఖనూ కేటాయించారు. జిల్లాలో మూలపేట పోర్టు పనులు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా మంత్రికే మత్స్యశాఖను కేటాయిస్తే, పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు వీలుంటుందన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ శాఖను అప్పగించారన్న చర్చ నడుస్తోంది. మత్స్యశాఖతో పాటు పశుసంవర్థకశాఖనూ ఆయనకే ఇచ్చారు. వైసిపి ప్రభుత్వంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిర్వహించిన శాఖలను టిడిపి ప్రభుత్వమూ జిల్లా మంత్రికే ఇవ్వడం గమనార్హం.ఆయా శాఖల అధికారుల్లో గుబులుజిల్లాకు చెందిన మంత్రికి వ్యవసాయం, సహకార, మత్స్య, పశుసంవర్థకశాఖలను కేటాయించడంతో ఆయా శాఖల అధికారుల్లో గుబులు మొదలైంది. జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నన్ని రోజులూ ప్రోటోకాల్‌ పాటించాల్సి ఉంటుంది. సమీక్షలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తదితర కార్యక్రమాలు ఉంటే ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇక్కడకు వచ్చే అవకాశం ఉండడంతో వారిలో ఇప్పుడు టెన్షన్‌ మొదలైంది. దీంతోపాటు 2014లో టిడిపి, 2019లో వైసిపి ప్రభుత్వ హయాంలో పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలను నేతలు జిల్లా కేంద్రం పర్యటనకు వచ్చిన సందర్భంలో తమ అనుచరులు, కార్యకర్తల భోజన, ఇతర ఖర్చులను ఆయా శాఖల అధికారులతోనే పెట్టించేవారన్న విమర్శలు ఉన్నాయి.17న జిల్లాకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాకకేంద్ర, రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇరువురూ ఈనెల 17న జిల్లాకు రానున్నారు. పర్యటనా వివరాలను కోటబొమ్మాళిలోని టిడిపి కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది.షెడ్యూల్‌ ఇలా…ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఎన్‌ఎడి, అక్కడ్నుంచి మద్దిలపాలెం మీదుగా ర్యాలీగా జిల్లాకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోగాపురం వద్ద భోజన విరామం. 2.30 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం సింహద్వారం, డే అండ్‌ నైట్‌ కూడలి మీదుగా ఏడు రోడ్ల కూడలి, జి.టి రోడ్డు, సూర్యమహల్‌ కూడలి, అరసవల్లి కూడలి మీదుగా 80 అడుగుల రోడ్డులోని రామ్మోహన్‌ నాయుడు నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు అక్కడ్నుంచి సూర్యమహల్‌, రామలక్ష్మణ కూడలి, పెద్దపాడు మీదుగా నిమ్మాడ చేరుకుంటారు.టిడిపి బాధ్యతల నుంచి అచ్చెన్న రిలీవ్‌టిడిపి రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటివరకు కొనసాగిన కింజరాపు అచ్చెన్నాయుడుని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో, పార్టీ అధిష్టానం ఆయన్ను అధ్యక్ష బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసింది. కొత్త అధ్యక్షులుగా విశాఖ జిల్లా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియమించారు.

➡️