సాగునీటి పనులకు బ్రేక్‌

ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనులకు గ్రహణం పట్టింది. జిల్లా సాగునీటి పారుదల శాఖలో భారీగా పేరుకుపోయిన పెండింగ్‌ బిల్లుల చెల్లింపులే పనుల నిలుపుదలకు కారణమనే వాదన వినిపిస్తోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2, సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల ఆధునికీకరణకు సుమారు రూ.12 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. జిఎన్‌ఎస్‌ఎస్‌ ఆధునికీకరణ, నూతన రిజర్వాయర్ల నిర్మాణం, తెగిన రిజర్వాయర్ల పునరుద్ధరణ, పలుఎత్తిపోతల పనులు, ఎల్‌ఎ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులకు సంబంధించి సుమారు రూ.924 కోట్లు మేరకు అభివృద్ధి పనులు చేపట్టారు. ఏడాది కిందట రూ.139 కోట్ల చెల్లింపులు చేయడం మినహా మిగిలిన బిల్లులు చేయకపోవడం గమనార్హం. ప్రజాశక్తి – కడప ప్రతినిధిఉమ్మడి జిల్లా పరిధిలోని జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2లోని ప్యాకేజ్‌-1 కింద నాలుగేళ్ల కిందట రూ.5,030 కోట్లతో కాలేటివాగు ఎత్తిపోతల పథకం పనులు చేపట్టారు. 6.5 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో తలపెట్టిన మూడు కొత్త రిజర్వాయర్లలో రెండింటిని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ కరువు రక్కసిని పారదోలేందుకు ఉద్దేశించి రాయలసీమ డ్రౌట్‌మిటిగేషన్‌ ప్రాజెక్టు (ఆర్‌డబ్ల్యుఎంపి) మొదలుకుని పలు ప్రాజెక్టుల పనుల్లో ఎటువంటి పురోగతి లేకుండా పోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. 2024 మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేతులు మారడం సాగునీటి ప్రాజెక్టుల పనులకు శాపంగా మారినట్లు కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పనులు చేపట్టిన 15 కాంట్రాక్టు కంపెనీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా ఆధారంగా పనుల్ని నిలిపేయడం ఆందోళన కలిగిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాత సుమారు నాలుగు నుంచి ఆరు నెలలుగా పనుల్ని నిలిపేయడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. జిల్లాలో కాంట్రాక్టు పనులు దక్కించుకున్న కంపెనీల్లో ప్రధానంగా మెయిల్‌, పిఎల్‌ఆర్‌-ఎన్‌ఇసిఎల్‌, పిఎల్‌ ప్రాజెక్ట్స్‌, ఎంఆర్‌కెఆర్‌, రాఘవ కన్స్‌స్ట్రక్షన్స్‌, విపిఆర్‌, రిత్విక్‌, మాక్స్‌ ఇన్‌ఫ్రా, ఆర్‌ఆర్‌ కన్స్‌స్ట్రక్షన్స్‌, కెఎంవి, ఆర్‌విఆర్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, రత్న ఇన్‌ఫ్రా, మైథాస్‌ ఎన్‌సిసి వంటి కాంట్రాక్టు కంపెనీలు ఉన్నాయి. ఏడు కంపెనీలు ఐదేళ్లుగా తట్టెడు మట్టి ఎత్తిపోసిన దాఖలాలు లేవని వాదన వినిపిస్తోంది. బిల్లుల చెల్లింపులు నిలిచిపోయిన నేపథ్యంలో ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌ యంత్రాంగం బడా కాంట్రాక్టు కంపెనీలతో పనులు చేయించలేక చేతులెత్తిసినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం స్పందించి పోలవరానికి పరిమితం గాకుండా జిల్లా సాగు నీటి ప్రాజెక్టు పనులను పరుగులు తీయించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదన వినిపిస్తోంది.

➡️