భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం

భవన నిర్మాణ కార్మిక

మాట్లాడుతున్న భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు

  • ఎన్నికల్లో రాజకీయ పార్టీల వైఖరి స్పష్టం చేయాలి
  • భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ద్వారా అమలు చేయాల్సిన సంక్షేమాన్ని నిలిపివేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, కార్యదర్శి మంతెన హరనాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్మాణ కార్మికులపై వాటి వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సంఘ కోశాధికారి మాచెర్ల చక్రధర్‌, ఎ.కామేశ్వరరావుతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అమలవుతోందని, రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదని తెలిపారు. కార్మిక చట్టాలను అనుసరించి నిర్మాణదారుల నుంచి నిర్మాణ విలువలో వసూలు చేస్త్ను ఒక శాతం సెస్‌ రూ.వేల కోట్లు ఉందన్నారు. ఆ నిధులను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు కావడం వల్ల నిర్మాణ కార్మికులకు ప్రత్యేక పథకాలు అవసరం లేదనడాన్ని ఆక్షేపించారు. సామాన్యులకు ఇస్తున్న పథకాలకు, నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం ఉందన్నారు. సంక్షేమ పథకాలు ప్రభుత్వ నిధులతో అమలు చేయాల్సి ఉందని, కార్మికుల నిధిని దారిమళ్లించి కాదన్నారు. నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు భవన నిర్మాణ యజమాని నుంచి వసూలు చేస్తున్న సంక్షేమ నిధి నుంచి అమలవుతాయని, వీటి వల్ల ప్రభుత్వ ఖజానాపై పైసా భారం ఉండదన్నారు. నవరత్నాలు నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టానికి ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. అందువల్ల కార్మిక సంక్షేమ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేలాది క్లమ్‌లు చెల్లిస్తామని, నిర్మాణ సంక్షేమ నిధిని నిర్మాణ కార్మికుల కోసం మాత్రమే ఖర్చు చేస్తామని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌పై సానుకూలంగా స్పందించే రాజకీయ పార్టీలకే భవన నిర్మాణ కార్మికుల మద్దతు ఉంటుందన్నారు.

➡️