స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలన

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో

భద్రతా ఏర్పాట్లను వివరిస్తున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబధించి నియమితులైన ఎన్నికల పోలీసు పరిశీలకులు దిగంబర్‌ పి.ప్రధాన్‌, సచ్చింద్ర పటేల్‌ ఎస్‌పి జి.ఆర్‌ రాధికతో కలిసి స్థానిక శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ భద్రతా ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఇవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించి అక్కడ భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్‌రూముల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా వివరాలు, గార్డ్‌ సిబ్బంది, ఇవిఎం బాక్సులను తీసుకొచ్చే రూట్‌మ్యాప్‌, కేంద్ర బలగాల సమన్వయంతో చేపట్టిన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను ఎస్‌పి పరిశీలకులకు వివరించారు. అనంతరం ఎన్నికల పరిశీలకులు సచ్చింద్ర పటేల్‌ జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ను గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఎన్నికల సన్నద్ధత, పోలీసు శాఖపరమైన అంశాలపై చర్చించారు. స్ట్రాంగ్‌రూమ్‌ పరిశీలనలో ఎఎస్‌పి జి.ప్రేమ్‌కాజల్‌, డిఎస్‌పి వై.శ్రుతి, ఎస్‌ఐ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

➡️