వైసిపికి చరమగీతం పాడాలి : ఎంపీ

ఎన్నికలకు మరి కొన్ని గంటల వ్యవధి ఉండడంతో టిడిపి నాయకులు

ప్రజలకు అభివాదం చేస్తున్న రామ్మోహన్‌ నాయుడు, శంకర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికలకు మరి కొన్ని గంటల వ్యవధి ఉండడంతో టిడిపి నాయకులు తమ ప్రచారం దూకుడు పెంచారు. శనివారం ఉదయం నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడుతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌లు పాల్గొని ఎన్నికల్లో ఓటువేసి విజయాన్ని అందించాలని కోరుతూ ప్రజలకు అభివాదం చేశారు. నగరంలోని 80 అడుగుల రోడ్డు నుంచి ప్రారంభమైన బైక్‌ ర్యాలీ కళింగ రోడ్డు, ఏడురోడ్ల జంక్షన్‌, జి.టి.రోడ్డు, చౌక్‌బజార్‌, మాధవ్‌ మోటార్స్‌, రామలక్ష్మణ జంక్షన్‌ మీదుగా మండలం తంగివానిపేట, పెదపాడు, తండ్యాంవలస, బెండి వానిపేట, సిలగాం సింగువలస వరకు సాగింది. అనంతరం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసిపికి ఎదురుగాలి వీస్తోందని, ఐదేళ్ల ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర పడిందన్నారు. అయిదేళ్లలో స్వలాభం తప్ప ప్రజాసంక్షేమం పట్టని నేతలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పనున్నారన్నారు. వైసిపి నిర్లక్ష్యాలను, నిరంకుశ నిర్ణయాలను కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారుల్లో గెలవాలని చూస్తున్నారని, ఈకుయుక్తులను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. దేశంలో ఎక్కడా అమలుకాని ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను తీసుకొచ్చి ప్రజల భూములు కొట్టేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజల గౌరవాన్ని నిలిపే చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. నియోజక వర్గంలో కూటమి అభ్యర్థులుగా రామ్మోహన్‌ నాయుడు, గొండు శంకర్‌ల విజయానికి తోడ్పాటు అందించాలని కోరారు. ర్యాలీలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

 

➡️