భూములు కాజేసేందుకే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు

రాష్ట్ర ప్రజల

మాట్లాడుతున్న కలమట వెంకటరమణ

  • టిడిపి జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్ర ప్రజల భూములను కాజేసేందుకు వైసిపి ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును తీసుకొచ్చిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ ఆరోపించారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని గతేడాది అక్టోబరు 31వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తూ వైసిపి ప్రభుత్వం 512 జిఒను తీసుకొచ్చిందని తెలిపారు. ఎపి ల్యాండ్‌ అథారిటీని ఏర్పాటు చేసి, దానికి చైర్మన్‌, కమిషనర్‌, సభ్యులను నియమిస్తూ గతేడాది డిసెంబరు 29న ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. భూ భక్ష చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి ఇంకా మార్గదర్శకాలు ఇవ్వలేదంటా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రం చట్టం చేయక ముందే ఎందుకు అమలు చేశారో జగన్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌, గంజాయి, డ్రగ్స్‌, ఎర్రచందనం, రేషన్‌ బియ్యం కొల్లగొట్టడం ద్వారా రూ.ఎనిమిది లక్షల కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. ఈ పాపపు సొమ్మును భూముల్లోకి తరలించడానికి సివిల్‌ కోర్టులు అడ్డంకిగా ఉన్నాయని, కోర్టుల రక్షణను తొలగించడానికే రెవెన్యూ అధికారులకు సివిల్‌ కోర్టుల అధికారాల్ని కట్టబెడుతూ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం తెచ్చారని తెలిపారు. జగన్‌ బినామీ కంపెనీ ఇండోసోల్‌కు రామయ్యపట్నం పరిసరాల్లోనే 8,500 ఎకరాల రైతుల భూములను కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా భూదందాలకు తెర తీసిన జగన్‌ బృందం లక్షలాది ఎకరాల భూములను కాజేసేందుకు చూస్తున్నారన్నారు. చట్టంలో టిఆర్‌ఒల నియామకమంటూ వైసిపి అనుకూల వ్యక్తులను నియమించి ఈ భూములను కాజేయనున్నారని ఆరోపించారు. ఈ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని, ఈ ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపించి ఎవరి భూములను వారు రక్షించుకోవాలన్నారు. సమావేశంలో బిసి సాధికారిక సంఘ సభ్యులు వెంకటరామరాజు, జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షులు గోర అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️