ఎన్నికల నిర్వహణపై అప్రమత్తం

ఎన్నికల నిర్వహణలో

మాట్లాడుతున్న ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

  • సెక్టోరియల్‌ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
  • ఉదయం 7 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌
  • జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్‌ అధికారులు బాధ్యతగా పనిచేయాలని, ఎన్నికల సంఘం సూచనలను శతశాతం తూచా తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. ఎన్నికల సెక్టోరియల్‌ అధికారులకు ఇవిఎం హేండ్స్‌ ఆన్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్టోరియల్‌ అధికారులు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలనుసారం 72 గంటల ప్రోటోకాల్‌ చాలా కీలకమన్నారు. ఆయా కేంద్రాలకు వెళ్లి ఎటువంటి సమస్యలున్నా సత్వర పరిష్కారానికి చర్యలు, సమయపాలన పాటించాలన్నారు. సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు. రిసెప్షన్‌ సెంటర్‌ ఎచ్చెర్లలోని శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 17 అంశాలతో కూడిన ఫార్మాట్‌ ఉంటుందన్నారు. పోలింగ్‌ మెటీరియల్‌ పూర్తిస్థాయిలో తీసుకున్నది చెక్‌లిస్ట్‌ ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈనెల 13న పోలింగ్‌ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుందన్నారు.సెక్టోరియల్‌ అధికారులు పోలింగ్‌ రోజున అన్ని పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి రిపోర్టులను ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌కు నియమావళి ప్రకారం అందజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ తెలిపారు. ఏదైనా పోలింగ్‌ కేంద్రంలో సమస్యలు ఉంటే తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. స్క్రూట్నీ ఫార్మేషన్స్‌ సకాలంలో నిర్వహించాలని చెప్పారు. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్నీ సందర్శించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో పూర్తి మెటీరియల్‌ అందజేయనున్నటు తెలిపారు. ప్రతి విషయంపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌ కేంద్రంలో ఇవిఎంల్లో సమస్య ఉత్పన్నమైతే సెక్టోరియల్‌ అధికారులు తమ వద్దనున్న రిజర్వు పరికరాలతో వాటిని భర్తీ చేయాలని చెప్పారు. శిక్షణా తరగతుల్లో ఇవిఎంల నిర్వహణకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సిఇఒ వెంకటేశ్వరరావు, శిక్షణా తరగతుల నోడల్‌ అధికారి బాలాజీ నాయుక్‌, మాస్టర్‌ ట్రైనర్‌ శేషగిరి, కిరణ్‌, ఎన్‌ఐసి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️