స్టాప్‌ లైన్‌ ఈ చలానాలు రద్దు చేయాలి

  • కలెక్టరేట్‌ వద్ద ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ధర్నా.. డిఆర్‌ఓకి వినతి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్టాప్‌ లైన్‌ ఈ చలనాలు రద్దు చేయాలని రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కన్వీనర్‌ ఏ.జగన్మోహన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఫెడరేషన్‌ అధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. స్టాప్‌ లైన్‌ వైలేషన్‌ పేరుతో ఆటో క్యాబ్‌ డ్రైవర్లపై విధిస్తున్న ఈ చలానాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మాది సంక్షేమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని చెబుతున్న వైసిపి.. స్వయం ఉపాధిగా బతుకుతున్న ఆటో క్యాబ్‌ రవాణా రంగ డ్రైవర్లకు తెలియకుండానే జేబుదొంగ మాదిరిగా డబ్బులు కొట్టేస్తుందని విమర్శించారు. అందుకు స్టాప్‌ లైన్‌ ఈ చలానాలే నిదర్శనమన్నారు. ఈ చలనాలు చెల్లించేందుకు ఏపీ ట్రాన్స్పోర్ట్‌ డిపార్ట్మెంట్‌ ఈ చలానాల వెబ్సైట్లో అనుసంధానం చేయడంతో సమస్య మరింత జటిలమైందని, ఆర్టీవో ఆఫీస్‌కి వెళ్లేంతవరకు పెనాల్టీ పడిందనే విషయం డ్రైవర్లకు తెలియజేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాప్‌ లైన్‌ సీసీ కెమెరాలను క్రమబద్ధీకరించి ఈ చలనాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, డ్రైవర్లను జైల్లోకి పంపే క్రిమినల్‌ చట్టం బిఎన్‌ ఎస్‌ 106 (1,2) ను అమలకు కేంద్రం ఇచ్చిన జిఓ వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు. జిఓ రద్దు కోసం ఆటో, క్యాబ్‌ రవాణా రంగ డ్రైవర్లతో సంతకాలు సేకరించి, దశల వారి ఆందోళనకు పిలుపునిచ్చారు. అనంతరం గ్రీవెన్స్‌లో డిఆర్‌ఓ అనితకు వినతిపత్రం ఇచ్చారు. అంబేద్కర్‌ జంక్షన్‌ ఆటో స్టాండ్‌ అధ్యక్షులు వై.రామారావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో వై.భాస్కర్‌, సిహెచ్‌.మోహన్‌, బి.రామారావు, పి.సాగర్‌, ఆనంద్‌, వై.అప్పారావు, కే.అప్పారావు, పి.రామారావు, భాస్కర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

➡️