బిజెపి ఇంజిన్‌కు టిడిపి, వైసిపి బోగీలు

May 5,2024 22:00

ఈ మూడు పార్టీలను ఓడిస్తేనే ప్రజలకు రక్షణ

బహిరంగ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి / పాలకొండ  : బిజెపి ఇంజిన్‌కు టిడిసి.వైసిపి బోగీలులా పని చేస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ విమర్శించారు. ఈ మూడు పార్టీలను ఓడిస్తేనే ప్రజలకు రక్షణ ఉంటుందని అన్నారు. లేదంటే ఎపికి ప్రత్యేక హోదా రాకపోవడంతో పాటు ప్రజా హక్కులు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సకు, ఇండియా వేదిక నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం పాలకొండలో బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ముఖ్యవక్త పాల్గొని మాట్లాడారు. తొలుత పాలకొండ చేరుకున్న ఆమెకు సిపిఎం, కాంగ్రెస్‌ శ్రేణులు డప్పుల వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం సిపిఎం మన్యం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తిరుపతి రావు అధ్యక్షతన జరిగిన సభలో బృందాకరత్‌ మాట్లాడారు. సిపిఎం, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇద్దరూ యువకులని, పార్లమెంటులో పేదల తరుపున గట్టిగా పోరాడుతారన్న నమ్మకం తనకుందన్నారు.

ప్రస్తుత ఎన్నికలు అసాధారణమైనవని అన్నారు. ఎన్నికల ద్వారా దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని ఇంతలా ఖూనీచేసిన ప్రభుత్వం బిజెపియేనన్నారు తీవ్రమైన దాడులు జరడం ఇదే మొదటి సారన్నారు. దేశంలో గిరిజన హక్కుల రక్షణ, 5వ, 6వ షెడ్యుల్‌ ఏరియా అనే రెండు చట్టాలు రాజ్యాంగం కల్పించిందన్నారు. 2004లో కమ్యూనిస్టుల సహకారం తో అధికారంలొకి వచ్చిన యుపిఎ -1 ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చిందన్నారు. వీటికి మోడీ ప్రభుత్వం గడిచిన పదేళ్ళలో తూట్లు పొడుస్తూ గిరిజ ప్రాంతంలోని సంపద కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నించారని తెలిపారు. అటవీ సంరక్షణ చట్ట సవరణ పేరుతో గిరిజన హక్కులను బిజెపి కాలరాస్తోందన్నారు. గ్రామ సభలు జరిపి ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా బొగ్గు, అటవీ సంపద తదితరాలను అదానీ, అంబానీలకు కట్టబెడుతోందన్నారు. ఇటువంటి పరిస్థితి మునుపెన్నడూ చూడలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గిరిజనుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందన్నారు. జీవో నెంబర్‌ 3 రద్దుతో గిరిజన ప్రాంతాల్లో నూరు శాతం రిజర్వేషన్‌ రద్దు చేసినప్పటికీ మోడీ స్పందించలేదన్నారు. దీంతో, గిరిజనులు ఉద్యోగ, ఉపాధికి దూరం కావడం తోపాటు, విద్యలో వెనుక బాటు మొదలైందన్నారు. ముఖ్యంగా గిరినేతర భాష వల్ల పాఠశాల విద్యార్థులు పాఠ్యాంశాలను సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారనీ వివరించారు. అటవీ ప్రాంతంలోని గిరిజనేతర నిరుపేద విద్యార్దులు కూడా నష్ట పోతున్నారన్నారు. అయినా మోడీ దీన్ని లెక్క చేయడం లేదన్నారు. మోడీ విధానాల వల్ల గత పదేళ్లలో 4లక్షల మంది ఆత్మహత్యలు, 25వేల మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారని అన్నారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి మానవత్వం లేదన్నాను. రైతులు, కార్మికులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి ఎన్నికల వేళ ఆయా తరగతులలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారం లోకి రాకముందు దేశంలో ఒక్క శాతంగా ఉన్న ధనవంతులు ఇప్పుడు 40శాతంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు రైతులు, కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ లో చట్టాలు చేసి, ఇవి జనానికి తెలియకుండా చేసేందుకు మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇది ఆదివాసీలు, మైనార్టీ భావాలు దెబ్బ తీస్తోందన్నారు. మణిపూర్‌ లో ఆదివాసీల మధ్య మతం పేరుతో ఘర్షణలు సృష్టించడం ఇందుకు నిదర్శనమన్నారు. అందుకే మతతత్వ బిజెపిని ఓడించాలని సిపిఎం కోరుతోందన్నారు. ఏపీలో విచిత్రమైన పరిస్థితి ఉందని, బిజెపి ఇంజన్‌కు టిడిపి, వైసిపి బోగీల్లా పనిచేస్తున్నాయని బృందాకరత్‌ విమర్శించారు. వైసిపి ఎంపిలు రాష్ట్రం కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. గిరిజనులు, కార్మికులకు వ్యతిరేక చట్టాలపైన, ఎపికిి ఏంతో అవసరమైన ప్రతేక హోదా పైనా మాట్లాడకుండా నోటికి బంక అంటించుకున్నారని అన్నారు. చాలామందిని భయపెట్టి రూ.8,500 కోట్లు ఎన్నికల బాండ్లను బిజెపి తీసుకుందనీ విమర్శించారు. బిజెపి వాషింగ్‌ మిషన్‌ వంటిదని, సిబిఐ, ఇడి, ఐటి వంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలను వాషింగ్‌ పౌడర్‌లా ఉపయోగించుకుంటుందని విమర్శించారు. తద్వారా టిడిపి,వైసిపిలను బిజెపి బెదిరిస్తుందని తెలిపారు. బిజెపి టైర్‌ పంచర్‌ అయిపోయిందని, దీంతో ఆపార్టీ వాహనాలకు టిడిపి బ్యాక్‌ టైర్‌ లాగా, వైసిపి స్టెపినీ లాగా పని చేస్తున్నాయన్నారు. దీన్ని ప్రజలు ఇక అంగీకురించబోరని అన్నారు వైసిపి, టిడిపి ఎంపిలు ఎంపిప్రత్యేక హోదా కోసం పోట్లాడడం లేదని, అందుకే ఇండియా వేదికలో చేరలేదని తెలిపారు. ప్రజాస్వామ్యం కాపాడ డానికే అనేక పార్టీలు ఇండియా వేదిక లోకి వచ్చాయనాక్నరు బిజెపిని, దాని పొత్తులు, తొత్తులను ఓడించి, సిపిఎం, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం గత పదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదని, కరోనా సమయంలోనూ ప్రజలను ఆడుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. బిజెపి, దాని మిత్ర పక్షాలను ఓడించి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అరకు ఎంపిఅభ్యర్థి పి.అప్పలనర్స మాట్లాడుతూ బిజెపి మరోసారి అధికారం లోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులు, గిరిజనులు, మహిళలు, కార్మికులు, మైనార్టీల హక్కులను కాల రాసిందని అన్నారు. వైసిపి, టిడిపి ఎంపి, ఎంఎల్‌ఎ అభ్యర్థులు గిరిజనులు కాదని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోటీ చేస్తున్నా రని అన్నారు, వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కాంగ్రెస్‌ పాలకొండ ఎంఎల్‌ఎ అభ్యర్థి సవర చంటిబాబు మాట్లాడుతూ ఇండియా వేదికను గెలిపించడం ద్వారానే బిజెపి నుంచి ప్రజలకు రక్షణ అని అన్నారు. తనను గెలిపిస్తే గిరిజనుల గొంతు నై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు, కె.సుబ్బరావమ్మ, సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి, మన్యం, శ్రీకాకుళం జిల్లాల కార్యదర్శులు రెడ్డి వేణు, గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె.మన్మధరావు, మన్యం జిల్లా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు తదితరులు మాట్లాడారు.
➡️