బందవలసకు రోడ్డు మోక్షమెప్పుడో?

Jun 27,2024 21:29

ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని పెద్దవలస పంచాయతీ నుంచి బందవలస గ్రామానికి వెళ్లే రహదారి పరమ అధ్వాహ్నంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ రోడ్డు మరమ్మతులకు గురైనా పట్టించుకొనే నాధుడే లేదు. దీంతో ఈ గ్రామ గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన ఎవరైనా పడితే వారిని డోలీపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఈ గ్రామానికి చెందిన చిన్నారులు చదువుకోడానికి పాచిపెంట వెళ్లాలంటే కిలోమీటర్ల దూరాన నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపాటి చినుకుపడ్డా కనీసం నడవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి నెలకొందని ఈ గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెద్దవలస-బందవలస రోడ్డు నిర్మించాలని గిరిజన సంఘం నాయకులు జాడుదొర గంగయ్య, సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు కోరారు. పెద్దవలస నుంచి బందవలస వరకు రోడ్డు లేకపోవడం వల్ల ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే పాచిపెంట పిహెచ్‌సికి తీసుకురావడానికి కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 108 వాహనం కూడా ఈ గ్రామానికి రాలేదని, కనీసం ఆటోలు కూడా నడవని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే గ్రామానికి చెందిన జాడుదొర చెల్లమ్మ అనే వృద్ధురాలు బుధవారం అనారోగ్యం బారినపడింది. అయితే ఆమె పాచిపెంట పిహెచ్‌సికి తరలించేందుకు వాహనాలేవీ రాకపోవడంతో గ్రామస్తులు డోలిపై ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. చిన్నపాటి వర్షంతో ప్రజలు నిత్యవసర వస్తువులు కూడా తీసుకురాని పరిస్థితి ఉందన్నారు. కావున అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.

➡️