ఆక్రమణదారులను వదిలిపెట్టేది లేదు : ఎమ్మెల్యే

Jun 29,2024 20:46

ప్రజాశక్తి – పాలకొండ : భూ ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ హెచ్చరించారు. శనివారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకొండ పట్టణంలో ప్రభుత్వ భూములు ఇష్టానుసారంగా కబ్జాలకు గురయ్యాయని, దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేసేదే లేదని అన్నారు. ప్రజా అవసరాలకు భూములు దొరకడం లేదు కానీ కబ్జాదారులకు మాత్రం భూములు ధారదాత్తం చేస్తారంటూ రెవెన్యూ అధికార యంత్రాంగంపై మండిపడ్డారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు దృష్టిపెట్టి ప్రభుత్వ భూములు గుర్తించి అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. ఎక్కడ్కెనా అక్రమణలుంటే వెంటనే గుర్తించి తొలగించాలన్నారు. అదే విధంగా జగనన్న కాలనీల్లోనూ భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. ఎకరాకు రూ.10 లక్షలు ఉన్న స్థలాన్ని ఎకరానికి రూ.4 లక్షలు ఇచ్చి కొనుగోలు చేయడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఇది పెద్ద స్కాం అని అనుమానం వ్యక్తం చేశారు. అదే విధంగా 4వేలు మీటర్లు గ్రావెల్‌ రోడ్డుకు రూ.76లక్షలు జగనన్న కాలనీలో ఖర్చు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో గ్రామీణ ప్రాంతాల వారిని ఎంపిక చేసి అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేశారన్నారు. నగర పంచాయతీలో వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే వార్డుల్లో స్వయంగా తానే పర్యటిస్తానని, రెండ్రోజులకు ఒక్కసారి అధికారులు కూడా తిరగాలని సూచించారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలన్నారు. అలాగే డంపింగ్‌ యార్డు సమస్యను కూడా పరిష్కరించాలని, టిడి పారాపురం వద్ద వివాదం ఉంటే వేరే చోట ఐదు ఎకరాలు స్థలాన్ని గుర్తించలేరా అని ప్రశ్నించారు. అదే విధంగా ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించాలని, రిఫర్‌లు లేకుండా వచ్చిన రోగులకు వీలైనంత వరకు ఇక్కడే సేవలందించాలని సూచించారు. ఏరియా ఆసుపత్రిలో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ ఏడాది ఖరీప్‌ సీజన్‌కు తోటపల్లి ఎడమ కాలువ ద్వారా నీరు పాలకొండకు అందేలా చూడాలన్నారు. ఆధునీకరణ పనులు అలస్యమవుతున్న కారణంగా తాత్కాలికంగా పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్‌ శాఖాధికారు లను ఆదేశించారు. బాల్య వివాహాల నిర్మూలనకు ఐసిడిఎస్‌ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ముందుగా ప్రజల్లో బాల్య వివాహాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో నగర పంచాయతీ కమిషనర్‌ సర్వేశ్వరరావు, తహశీల్దారు వరహాలు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నాగభూషణరావు, మాజీ ఛైర్మన్‌ ప్రతినిధి పల్లా కొండలరావు, పట్టణ టిడిపి అధ్యక్షులు గంటా సంతోష్‌కుమార్‌, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తి బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి తన సొంతంగా రూ.50వేలు విరాళం ప్రకటించారు.

➡️