దళితుల భూములపై మాట్లాడని ఆ పార్టీలు : సిపిఎం

May 11,2024 23:45

విలేకర్లతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరచ్చకుండా, ప్రజా సమస్యలను విస్మరించిన వైసిపి, టిడిపి, కేంద్రంలోని బిజెపిలు ఇప్పుడు ఎన్నికల కోసం కల్లబొల్లి మాటలు చెబుతున్నారని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ విమర్శించారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇంటి పన్నుల భారం మోపారని, చెత్తపన్ను వేశారని విమర్శించారు. ప్రమాదకరమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును మూడు పార్టీలు కలిసే తెచ్చాయన్నారు. యడవల్లి, మురికిపూడి దళిత భూముల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలేమీ మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి, దేశ సమగ్రతకు ప్రమాదమని, ఈ నేపథ్యంలో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నరసరావుపేట ఎంపీగా కాంగ్రెస్‌ అభ్యర్థి గర్నెపూడి అలెగ్జాండర్‌ సుధాకర్‌ను, చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఎం.రాధాకృష్ణకు ఓటేయాలన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నల్ల ధరాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో వేయడం వంటి హామీలిచ్చిన బిజెపి దేశ ప్రజలను తీవ్రంగా మోసం చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతోందని, ఆ పార్టీని మళ్లీ గెలిపిస్తే దేశం మరింత ఇబ్బందుల్లో పడుతుందని చెప్పారు. సిపిఎం నాయకులు ఎస్‌.లూథర్‌ మాట్లాడుతూ వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉచిత విద్యుత్‌ను దూరం చేస్తున్నారు. ఆయా పార్టీలు చెప్పే మాటలను నమ్మకుండా ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

➡️