ఓటుకు వేళాయే!

ఓటు వినియోగం, నిర్థారణపై అవగాహన

సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం

ఓటరు చేతితో అభ్యర్థుల భవితవ్యం

ఓటు వినియోగం, నిర్థారణపై అవగాహన

(ప్రజాశక్తి- విశాఖపట్నం)

సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఎన్నికల సంఘం, అధికారులు, రాజకీయ పార్టీలు, పోటీ అభ్యర్థులు ఇలా ఎవరి పనిని వారు కానిచ్చేశారు. ఇపుడు ఓటర్ల వంతు వచ్చింది. నచ్చిన, మెచ్చిన అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం మిగిలి ఉంది. దీనికి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో బటన్‌ నొక్కి ఓటేయడమే తరువాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటి, రాజ్యాంగబద్ధ హక్కుగా దక్కిన అత్యంత అమూల్యమైన ఓటును అప్రమత్తతతో, సక్రమంగా వినియోగించుకోవడం ఇపుడు ఓటరు చేతిలోనే ఉంది. దేశం, రాష్ట్రం, ప్రజా ప్రయోజనంతోపాటు భావితరాల భవిష్యత్‌ను నిర్ధేశించే ఓటు ఎలా వేయాలనే దానిపై అనేకమందిలో సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు స్లిప్పు పొందడం నుంచి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఇవిఎంలలో ఓటేయడం. అది సరిగా నమోదైందో లేదో నిర్థారించుకోవడంపై ఓటర్లలో అవగాహనకు ఓసారి పరికిద్దాం.

ప్రతి ఓటరూ రెండు ఓట్లేయాలి…

ప్రస్తుతం రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి.ప్రతి ఓటరూ తమ పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యేను ఇద్దరినీ ఎన్నుకోవాల్సి ఉంది. దీనికోసం ఒక్కొక్కరు రెండేసి ఓట్లేయాల్సి ఉంది, పోలింగ్‌ కేంద్రంలో రెండు ఇవిఎం మిషన్లలో ముందుగా ఎంపీ స్థానానికి, తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేయాల్సి ఉంటుంది. పోలింగ్‌ కేంద్రాన్ని నిర్థారించుకోవాలి..ప్రతిఒక్కరూ తమ ఓటు ఏ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉందో ముందుగా నిర్థారించుకోవాలి.దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఓటరు స్లిప్పులను అందజేశారు. వాటిల్లో ఓటరు పేరు, ఓటరు జాబితాలో ఎన్నో సీరియల్‌ నెంబరులో ఉన్నదీ, పోలింగ్‌ కేంద్రం ఇతరత్రా సమాచారం ఉంటుంది. ఒక వేళ ఓటరు స్లిప్‌ అందకపోతే, హెల్ప్‌లైన్‌ యాప్‌, మొబైల్‌లో ఆన్‌లైన్‌లోఇతరత్రా మార్గాల్లో పొందవచ్చు.

ఓటరు స్లిప్‌, గుర్తింపు కార్డుతో పోలింగ్‌ కేంద్రానికి…

పోలింగ్‌ రోజున నిర్ధేశించిన సమయంలో ఓటరు స్లిప్‌, ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డులతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలి. పోలింగ్‌ బూత్‌లో మొదట్లో ఉన్న అధికారికి ఓటరు స్లిప్‌ను ఇస్తే, జాబితాలోని వివరాలతో సరిపోల్చి, పేరుతో సహ జాబితాలోని సీరియల్‌ నెంబర్‌ను చదివి వినిపిస్తారు. అభ్యర్థుల తరుపున పోలింగ్‌ ఏజెంట్లుగా ఉన్న వ్యక్తులు వాటిని సరిచూసి,ఎటువంటి అభ్యంతరం లేదని ఓకే చెబితే టిక్‌ మార్కు పెట్టుకున్నాక, ముందుకు పోనిస్తారు.

ఓటుకు అనుమతిస్తూ రిజిస్టర్‌లో సంతకం..

తర్వాత మరో పోలింగ్‌ అధికారి వద్దకు వెళితే, తన వద్దనున్న రిజిస్టర్‌లో ఓటరు, పేరు వివరాలను నమోదు చేసుకుని, ఓటరుతో సంతకం చేయిస్తారు. ఓటేసినట్లు నిర్థారణకు ఎడమచేతి చూపుడు వేలిపై సిరా రాసి, ఒక చీటి ఇస్తారు.తర్వాత మూడవ పోలింగ్‌ అధికారి వద్దకు వెళ్లి చీటిని అందిస్తే, చూపుడు వేలిపై సిరా గుర్తును తనిఖీ చేసి, ఓటేయడానికి అనుమతిస్తారు.అప్పుడు ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి, ఇవిఎంలలో ఓటేయాలి.

బీఫ్‌ శబ్ధం వస్తేనే ఓటేసినట్లు…

ఓటింగ్‌ కంపార్టుమెంట్‌లోని ఇవిఎం బ్యాలెట్‌ యూనిట్‌లో ఒక క్రమంలో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు ఉంటాయి.వాటిపై నీలిరంగు బల్బు వెలుగుతూ ఉంటుంది. బ్యాలెట్‌ యూనిట్‌లో నచ్చిన అభ్యర్థి పేరు, ఎన్నికల గుర్తును పరిశీలించి, నిర్థారించుకున్నాక దానికి ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్‌పై నొక్కితే, ఆ గుర్తు పక్కనే ఉన్న ఎరుపు బల్బు వెలగడంతోపాటు బీఫ్‌ శబ్ధం వస్తుంది. పక్కనే ఉన్న వివి ప్యాట్‌లో ఎవరికి ఓటేశారో అభ్యర్థి పేరు, క్రమసంఖ్య, గుర్తుతో కూడిన స్లిప్‌ కేవలం ఏడుసెకెన్లు పాటు మాత్రమే కనిపిస్తుంది. తర్వాత వివి.ప్యాట్‌ డబ్బాలో పడిపోతుంది..దీంతో ఓటేసే ప్రక్రియ పూర్తయినట్లే.

సందేహాలుంటే ఫిర్యాదు చేయొచ్చు…

ఇవిఎం బ్యాలెట్‌ ప్యాడ్‌లో బటన్‌ నొక్కిన తర్వాత ఎరుపు బల్బు వెలగకపోయినా, బీఫ్‌ శబ్ధం రాకపోయినా, వివి ప్యాట్‌ పెట్టెలో చీటి కనిపించకపోయినా వెంటనే అక్కడే ఉన్న ప్రిసైడింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అన్ని సందేహాలు, సంశయాలను నివృత్తి చేసుకున్నాకే పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు రావాలి.

➡️