‘ఇరకం’ దీవిలో పోలింగ్‌ కేంద్రాలు తనిఖీ

‘ఇరకం’ దీవిలో పోలింగ్‌ కేంద్రాలు తనిఖీపడవలో, ట్రాక్టర్‌లో వెళ్లిన కలెక్టర్‌ లక్ష్మీశటూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తాంప్రజాశక్తి – తడ మండలంలోని ఇరకం గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం కలెక్టర్‌ జి.లక్ష్మీశ పులికాట్‌ లేక్‌లో బోటులో ప్రయాణించి ఇరకం గ్రామం చేరుకుని, అక్కడ నుండి ట్రాక్టర్‌లో వెళ్లి తనిఖీ చేశారు. ముందుగా గ్రామంలో వెలసిన గ్రామ దేవత పోన్నియమ్మన్‌ అమ్మణ్ణీ దర్శనం చేసుకున్నారు. అనంతరం కాలినడకన ఇరకం గ్రామం నందు ఏర్పాటు చేసిన 291, 292 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.291 బూత్‌లో 407 మంది, 292లో 670 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ బిఎల్‌ఒలు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పిహెచ్‌సిని తనిఖీ చేసి, మందులు సరిపడా ఉంచుకోవాలని, హైరిస్క్‌ ప్రెగెన్సీవారు ఇద్దరు ఉన్నారని, వారికి మందులు, పౌష్టికాహారం అందించాలన్నారు. నులిపురుగుల నిర్మూలన మందులను పిల్లలు మింగేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ విధానంలో ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ టూరిజం కేంద్రంగా దీవిని అభివృద్ధి చేస్తామన్నారు. సర్పంచి భర్త గుణశేఖర్‌ మాట్లాడుతూ గ్రామంలోని మత్స్యకారుల పిల్లలు ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం బయట ప్రాంతాలకు వెళ్లలేక పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఎంఎల్‌ఎ కిలివేటి సంజీవయ్య చొరవతో పూడి గ్రామం వద్ద ఇళ్లస్థలాలు సేకరించామని, పంపిణీ ఆలస్యం అవుతుందని తెలిపారు. మత్స్యకారుల పట్టాల పంపిణీ పెండింగ్‌ అంశం వారం లోపు పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్ర నాథ్‌ రెడ్డి, తడ మండల తహశీల్దార్‌ సయ్యద్‌ ఇక్బాల్‌, ఎన్నికల డిటి పవన్‌ కుమార్‌, శరత్‌, సర్పంచ్‌ గుణశేఖర్‌, నాయుడుపేట డియస్పి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. సూళ్లూరుపేటలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్‌ను ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎంఎల్‌ఎ కిలివేటి సంజీవయ్య సత్కరించారు.

➡️