తిరుపతి రైల్వే స్టేషన్‌కు 132 ఏళ్లు

తిరుపతి రైల్వే స్టేషన్‌కు 132 ఏళ్లు

తిరుపతి రైల్వే స్టేషన్‌కు 132 ఏళ్లుప్రజాశక్తి- తిరుపతి సిటి: ఆధ్యాత్మిక నగరం తిరుపతికి ప్రపంచ పటంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి సుదూర ప్రాంతాల నుంచి భక్తులను, యాత్రికులను చేరవేసేందుకు అతి ముఖ్యమైన రవాణామార్గం రైల్వే. తిరుపతి రైల్వేస్టేషన్‌కు 132ఏళ్ల చరిత్ర ఉంది. దాన్ని గుర్తు చేసుకుంటూ జనవరి 11న తిరుపతి రైల్వేస్టేషన్‌ 133వ వార్షికోత్సవాన్ని రైల్వే అధికారులు, సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. కలియుగ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వల్ల తిరుపతి నగరం అత్యంత ప్రసిద్ధిగాంచింది. తొమ్మిది శతాబ్దాల క్రితం రామానుజూచార్యులు తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని సందర్శించిన తర్వాత భక్తుల భద్రత, సౌకర్యార్ధం తిరుమల (శేషచల) కొండల దిగువున ఒక పట్టణాన్ని స్ధాపించడం చాలా అసరమని నమ్మారు. 1130 ఫిబ్రవరి 24వ తేదిన కొత్తగా స్థాపించిన స్థావరానికి గోవిందపట్నం అని పేరు పెట్టారు. తర్వాత అది రామానుజపురంగా పిలవబడింది. 13వ శతాబ్దం నుండి తిరుపతిగా పిలవబడుతోంది. తిరుమల కొండలోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర రాజ్యాల నుంచి యాత్రికులు ఎక్కువుగా కాలినడకనే వచ్చేవారు. కొద్దికాలం తర్వాత ఎద్దులబండ్లపై, గుర్రపు బండ్లపై రాకపోకలు సాగించేవారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వారు తిరుపతిలో తమ బండ్లను, ఎద్దులను కట్టేసి, వాటికి గడ్డి, నీళ్లు అందుబాటులో ఉంచి కాలినడకన తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం అనంతరం తిరుపతికి చేరుకుని తిరిగి పయనమయ్యేవారు. రాను రాను స్వామివారి ఖ్యాతి ఖండాంతరాలు విస్తృరించడంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రవాణా సౌకర్యం కల్పించాలని అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం తిరుపతికి రైలు సౌకర్యం కల్పించింది. గోవిందరాజుస్వామి ఆలయానికి సమీపన రైలు నిలిపేందుకు ఒక స్టేషన్‌ అవసరమని బావించి స్టేషన్‌ నిర్మాణం చేపట్టి, 1891 జనవరి 11న తిరుపతి రైల్వేస్టేషన్‌ను ప్రారంభించారు. దక్షణ బారత రైల్వే కంపెనీకి చెందిన మీటర్‌ గేజ్‌లైన్‌ 1891 జనవరి 11న ప్రారంభించబడింది. తిరుపతిని కవర్‌ చేసే గూడూరు- కాట్పాడి లైన్‌ తర్వాత కాలంలో బ్రాడ్‌గేజ్‌గా మార్చబడింది. ఇతర స్టేషన్లకంటే ఈ స్టేషన్‌కు ప్రత్యేకస్థానం ఉంది. ఎందుకంటే ఇది తీర్ధయాత్ర స్థలం. 850 మీటర్ల ఎత్తులో ఉన్న తిరుమల కొండల శిఖరంపై వెలిసిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఉంది. ఈ స్టేషన్‌కు సమీపంలో శ్రీగోవిందరాజస్వామి ఆలయం, కఫిలతీర్ధం పుణ్యక్షేత్రం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, కోదండరామస్వామి ఆలయం, అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వస్వామి వంటి ప్రముఖ ఆలయాలు అత్యంత సమీపన ఉన్నాయి. బహుషా ఇన్ని ప్రసిద్ధిగాంచిన ఆలయాలు చుట్టుపక్కలే ఉన్న ఏకైక స్టేషన్‌ ఇదే కావచ్చు. దీనికి కొద్ది దూరంలో దక్షణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి, వినాయకస్వామి జన్మస్థలంగా చెప్పబడే కాణిపాకం, వెంకటేశ్వరాస్వామికి కల్యాణమైన నారాయణవనం వంటి ప్రసిద్ది ఆలయాలు కూడా ఉన్నాయి. స్టేషన్‌ ప్రారంభ రోజుల్లో పదుల సంఖ్యలో ప్రయాణీకులు స్టేషన్‌కు వచ్చేవారు. కొన్ని రోజులకు రైలు రాకపోకలు పెరిగాయి. దీంతో వందల నుంచి వేలకు యాత్రికుల రాకపోకలు సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రోజుకు కనీసం లక్ష మంది ప్రయాణీకులకు ఇతరాష్ట్రాల నుంచి తిరుపతి రైల్వేస్టేషన్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక ప్రాంతమే కాకుండా 8 విశ్వవిద్యాలయాలు (యూనివర్శిటీలు) గల ఏకైక నగరం, ఐసర్‌, త్రిబుల్‌ ఐటిఐ వంటి ప్రముఖ విద్యాసంస్థలు నెలకొల్పపడ్డాయి. తిరుపతి విద్యాకేంద్రంగా కూడా ఎదుగుతోంది. స్విమ్స్‌ ఆసుపత్రి, బర్డ్‌ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, రుయా ఆసుపత్రి, టాటా క్యానర్‌ ఆసుపత్రి, అరవింద ఐ ఆసుపత్రి, టిటిడి సెంట్రల్‌ ఆసుపత్రి, ఈఎస్‌ఐ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలతో పాటు అనేక ప్రయివేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులకు నిలియంగా వైద్యకేంద్రంగా కూడా ఎదుగుతోంది. రాయలసీమలోనే ప్రముఖ వ్యాపార కేంద్రంగా నిలుస్తోంది. తిరుపతికి సమీపంలోనే తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నరు, కర్ణాటక రాజధాని బెంగుళూరు వంటి ప్రముఖ నగరాలు ఉండడంతో దీన్ని ప్రాముఖ్యత మరింత పెరిగింది. దేశం నలుమూలల నుంచి తిరుపతి రైల్వేసౌకర్యం ఉంది. ఒక ప్లాట్‌ఫామ్‌తో రోజుకు ఒక రైలు వచ్చే స్టేషన్‌గా తిరుపతి దినదినాభివృద్ధి చెంది నేడు 8 ప్లాట్‌పామ్‌లతో రోజుకు కనీసం 62 రైలు రాకపోకలు సాగిస్తున్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ పర్యావరణ అనుకూల స్టేషన్‌, గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాచే గోల్డ్‌ రేటింగ్‌ పొందింది. తిరుపతి రైల్వేస్టేషన్‌ అన్ని అధునిక సౌకర్యాలతో ప్రపంచస్థాయి స్టేషన్‌గా అవతరించే దశలో ఉంది. ప్రస్తుతం మాస్టర్‌ఫ్లాన్‌ కింద అంతర్జాతీయస్థాయి సౌకర్యాలతో తిరుపతి రైల్వేస్టేషన్‌ ఎదుగుతోంది. నగర వ్యవస్థాపకులు, పాలకులు దృష్టి గురించి అవగాహన కల్పించేందుకు ఈ ఏడాది విశ్రాంతి రైల్వే ఉద్యోగులచే వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించి, వారిచేత కేక్‌కట్‌ చేసి సత్కరించారు. రైల్వే ఉద్యోగులు, పిల్లలు, యువత, స్థానిక ప్రచలకు రైల్వేవ్యవస్థ స్థాపన చరిత్ర, దాని వారసత్వం, రైల్వేస్టేషన్‌ భవనం, ఇతర పరికరాల వంటి విలువైన ఆస్తుల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా రైల్వే అధికారులు తిరుపతి రైల్వేస్టేషన్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

➡️